నెత్తిన పెట్టుకున్న నాయ‌కుడే జ‌గ‌న్‌పై తిరుగుబాటు!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఏరికోరి నెత్తిన పెట్టుకున్న నాయ‌కుడే …ఇప్పుడాయ‌న నిర్ణ‌యంపై తిర‌గ‌బ‌డ్డారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని నిర‌సిస్తూ ప‌ద‌వికి రాజీనామా చేశారు. జ‌గ‌న్‌పై తిరుగుబాటు బావుటా ఎగుర‌వేసిన ఆ నాయ‌కుడే యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మిప్ర‌సాద్‌.…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఏరికోరి నెత్తిన పెట్టుకున్న నాయ‌కుడే …ఇప్పుడాయ‌న నిర్ణ‌యంపై తిర‌గ‌బ‌డ్డారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని నిర‌సిస్తూ ప‌ద‌వికి రాజీనామా చేశారు. జ‌గ‌న్‌పై తిరుగుబాటు బావుటా ఎగుర‌వేసిన ఆ నాయ‌కుడే యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మిప్ర‌సాద్‌. డాక్ట‌ర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరును మార్చి డాక్ట‌ర్ వైఎస్సార్ పేరు పెట్టారు. దీనిపై టీడీపీ భ‌గ్గుమంది.

టీడీపీ నేత‌ల ఆగ్ర‌హాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. కానీ జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో నామినేటెడ్ ప‌ద‌వి పొందిన అధికార భాషా సంఘం అధ్య‌క్షుడు యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీప్ర‌సాద్ మ‌న‌స్తాపం చెందారు. త‌న ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చేసి నిర‌స‌న ప్ర‌క‌టించారు. నిజానికి వైసీపీతో యార్ల‌గ‌డ్డ‌కు ఎలాంటి సంబంధం లేదు. టీడీపీ హ‌యాంలో ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాన్ని పొందారు. 

టీడీపీకి అత్యంత స‌న్నిహితంగా మెలుగుతూ వ‌చ్చారు. వైసీపీ అధికారంలోకి రావ‌డానికి యార్ల‌గ‌డ్డ పాత్ర శూన్యం. కానీ వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న‌కు అధికార భాషా సంఘం అధ్య‌క్ష ప‌ద‌విని క‌ట్ట‌బెట్టి జ‌గ‌న్ గౌర‌వించారు. కేబినెట్ ప‌ద‌వి ద‌క్కించుకున్న యార్ల‌గ‌డ్డ గ‌త మూడేళ్లుగా అధికారాన్ని అనుభ‌విస్తున్నారు.

వైసీపీ అధికారంలోకి రావాల‌ని ఆర్థికంగా, మాన‌సికంగా ఎంతో ఖ‌ర్చు చేసిన‌ వారిలో చాలా మంది ఇప్ప‌టికీ ఎలాంటి ల‌బ్ధి పొంద‌లేదు. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్‌ను ఇప్ప‌టికీ ప్రేమిస్తూనే ఉన్నారు. అలాంటిది డాక్ట‌ర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీకి డాక్ట‌ర్ వైఎస్సార్ పేరు పెట్ట‌గానే మొట్ట‌మొద‌ట వ్య‌తిరేక‌త ప్ర‌భుత్వంలో భాగస్వామి అయిన యార్ల‌గ‌డ్డ నుంచి రావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. హెల్త్ యూనివ‌ర్సిటీకి పేరు మార్చ‌డం త‌ప్పా, ఒప్పా అనేది కాసేపు ప‌క్క‌న పెడ‌దాం. 

మ‌న‌సంతా టీడీపీ అభిమానాన్ని నింపుకున్న వారికి ప‌ద‌వులు ఇస్తే… ఇట్లే జ‌రుగుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వైసీపీ అధికారంలోకి రావాల‌ని క‌ష్ట‌ప‌డ్డ వారిని ప‌క్క‌న పెట్టి, మ‌రెవ‌రికో ప‌ద‌వులు ఇచ్చి జ‌గ‌న్ త‌గిన మూల్యం చెల్లించుకుంటున్నార‌ని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. జ‌గ‌న్ నిర్ణ‌యంపై తిర‌గ‌బ‌డి యార్ల‌గ‌డ్డ త‌గిన బుద్ధి చెప్పార‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు.