తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీయార్ ని కెలుకుతూ వస్తోంది. తన మానాన తాను సినిమాలు చేసుకుంటూ జూనియర్ ఉన్నారు. అయితే జూనియర్ ని తమ వైపుగా లాగాలని టీడీపీ ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. ఆయన దేనికీ రియాక్ట్ కావడంలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయినా కూడా జూనియర్ నుంచి ఏ రకమైన రియాక్షన్ కనిపించలేదు
ఆయన తన సినిమాలు తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే జూనియర్ అలా ఉన్నా వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. తన తాత ఎన్టీయార్ వర్ధంతి వేళ జూనియర్ ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించిమని బాలయ్య చెప్పినట్లుగా ప్రచారం సాగింది.
దీని మీద మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ విశాఖలో స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. జూనియర్ ఈ రోజున తన స్వయం కృషితో ఎదిగి ఎంతో ఎత్తున ఉన్నారని ప్రశంచించారు. జూనియర్ ఇమేజ్ ఆకాశం అంత ఉందని, ఆయన్ని ఎవరైనా కించపరచాలనుకుంటే మాత్రం ఆకాశం మీద ఉమ్మి వేసినట్లే అన్నారు.
జూనియర్ ని ఆయన తల్లి షాలిని ఎంతో కష్టపడి క్రమశిక్షణతో పెంచిందని యార్లగడ్డ గుర్తు చేశారు. జూనియర్ వ్యక్తిత్వం చాలా మంచిదని యార్లగడ్డ అన్నారు. జూనియర్ ని కెలకడం కాదు, ఆయన త్వరలో ఏమి చేస్తారో కూడా అంతా చూస్తారు అని యార్లగడ్డ అనడం విశేషం.
రాజకీయాల్లో హత్యకు ఉండవని ఆత్మహత్యలే ఉంటాయని యార్లగడ్డ అన్నారు. జూనియర్ తొందరలో ఏమి చేస్తారో చూస్తారు అని హింట్ ఇచ్చి వదిలారు. ఏపీలో భారీ ఎత్తున ఉన్న జూనియర్ ఫ్యాన్స్ టీడీపీకి యాంటీగా పనిచేస్తారు అని యార్లగడ్డ చెప్పకనే చెప్పారా అన్న డౌట్లు పుట్టుకువస్తున్నాయి.
రాజకీయాల్లో జగన్ హీరో అని యార్లగడ్డ ప్రశంసలు కురిపించారు. ఆయన ఒంటిచేత్తో వైసీపీని నిర్మించారని, ఈ రోజున ఆయన పార్టీకి ఆయనే సుప్రీం అని ఆయన నిర్ణయాలే పార్టీకి విజయం అయినా మరేదైనా చేకూరుస్తాయని అన్నారు. ఏపీలో ప్రజల మనసులో ఏముందో అదే వచ్చే ఎన్నికల్లో తీర్పుగా వస్తుందని యార్లగడ్డ నర్మగర్భ వ్యాఖ్యలు చేసారు.