మహేష్ మూవీ బెనిఫిట్ షో వేసి తప్పు చేశా

మొన్నటివరకు బెనిఫిట్ షోలు లేవు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి మిడ్ నైట్ షోలు మొదలయ్యాయి. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ వెసులుబాటులో సలార్ చాలా లబ్ది పొందింది. గుంటూరుకారం…

మొన్నటివరకు బెనిఫిట్ షోలు లేవు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి మిడ్ నైట్ షోలు మొదలయ్యాయి. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ వెసులుబాటులో సలార్ చాలా లబ్ది పొందింది. గుంటూరుకారం సినిమాకు కూడా బెనిఫిట్ షోలు వేశారు. ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు.

అయితే అలా మిడ్ నైట్ షోలు వేసి తప్పుచేశామంటున్నాడు నిర్మాత నాగవంశీ. మిడ్ నైట్ షోలు వేయడం వల్లనే గుంటూరుకారం సినిమాకు నెగెటివ్ టాక్ మొదలైందని అన్నాడు. ఫ్యాన్స్ దీన్ని మాస్ సినిమా అనుకున్నారని, కానీ ప్రచారం విషయంలో తాము చేసిన తప్పు వల్ల, దీన్ని ఫ్యామిలీ సినిమాగా చెప్పలేకపోయామని అన్నాడు.

“జనవరి 12న సినిమా రిలీజైతే, 5వ తేదీ వరకు పోస్ట్ ప్రొడక్షన్ లోనే ఉన్నాం. దీంతో మాకు కూర్చొని ప్రమోషన్ పై ఆలోచించడానికి టైమ్ లేదు. సినిమా ఈ రకంగా ఉంటుందని చెప్పలేకపోయాం. అలా చెప్పలేకపోవడం మా వైపు నుంచి తప్పు. అందుకే బెనిఫిట్ షో నుంచి దాదాపు 3 షోల వరకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. సలార్ మాస్ సినిమా కాబట్టి మిడ్ నైట్ ఒంటిగంట సినిమా చూసిన ఫ్యాన్స్ ఎలాంటి తప్పులు వెదకలేదు, వాళ్లకు ఓ హై వచ్చింది. కానీ గుంటూరుకారం ఫ్యామిలీ సినిమా. త్రివిక్రమ్ సినిమా. తల్లికొడుకు అనుబంధంపై త్రివిక్రమ్ తీసిన ఓ ఫ్యామిలీ సినిమాను అర్థరాత్రి ఒంటిగంట షో వేసి తప్పు చేశాను.”

గుంటూరుకారం సినిమా మాస్ సినిమా అని చెప్పామే తప్ప, అందులో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయని, పక్కా త్రివిక్రమ్ మార్క్ సినిమా అని ప్రచారం చేయలేకపోయామని, అందుకే తమ సినిమాపై ప్రారంభంలో విమర్శలొచ్చాయని అంటున్నారు నాగవంశీ. ఎప్పుడైతే ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్లలోకి వచ్చి సినిమాను ఇష్టపడ్డారో, వాళ్ల టాక్ బయటకొచ్చిన తర్వాత గుంటూరుకారం ఊపందుకుందంటున్నాడు ఈ ప్రొడ్యూసర్.

సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయని చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టిన ఈ నిర్మాత, సమీక్షలపై మరోసారి స్పందించాడు. నెగెటివ్ రివ్యూలు గుంటూరుకారం సినిమాను ప్రభావితం చేయలేదని అంటూనే.. తమ సినిమాకు భారీగా వసూళ్లు వస్తున్నాయని, ఫేక్ కలెక్షన్లు అనిపిస్తే నిరూపించాలని సవాల్ చేశారు.