గన్నవరం వైసీపీ అభ్యర్తి వల్లభనేని వంశీ – ఇది కొడాలి నాని ప్రకటన.
మచిలీపట్నంలో పేర్ని నాని లేదా ఆయన కొడుకు కిట్టు కానీ పోటీ చేస్తారు.. ఇది కూడా కొడాలి నాని ప్రకటనే. కుప్పం అభ్యర్థి భరత్ – ఇది మంత్రి పెద్దిరెడ్డి ప్రకటన..
వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని నేనే, నా జీవితాంతం నేనే ఎమ్మెల్యేగా ఉంటాను – ఇది నెల్లూరుకి చెందిన ఓ ఎమ్మెల్యే ప్రకటన.
ఇవన్నీ ప్లీనరీల్లో వెలువడుతున్న ప్రకటనలే. ఇలా ఎవరికి వారే అభ్యర్థుల్ని ప్రకటించేస్తున్నారు. 2024 అభ్యర్థుల లిస్ట్ ముందుగానే బయటపెడుతున్నారు. అంటే పరోక్షంగా జగన్ పై ఒత్తిడి పెంచుతున్నారా లేక, ఆయనపై భారం తగ్గిస్తున్నారా అనేది ముందు ముందు తేలుతుంది.
సిట్టింగ్ లకే టికెట్లు ఇస్తారా..?
151 మంది (నిన్నటి విక్రమ్ రెడ్డి సహా) వైసీపీ ఎమ్మెల్యేలలో దాదాపు అందరూ జగన్ కి విధేయులుగానే ఉన్నారు. అక్కడక్కడా ఒకరిద్దరు రివర్స్ అవుతున్నా.. వారికి కూడా వైసీపీని వదిలిపెట్టడం ఇష్టంలేదు. అదే సమయంలో వైసీపీ టికెట్ వస్తుందనే గ్యారెంటీ కూడా లేదు. పక్క పార్టీల నుంచి వచ్చి చేరిన ఐదుగురిలో రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ మినహ మిగతావారంతా లోకల్ గా పట్టు ఉన్నవారే. దాదాపుగా సిట్టింగ్ లను మార్చాల్సిన పరిస్థితి లేదనే అనుకోవాలి.
కానీ జగన్ ముందుచూపుతో ఉన్నారు. 2019లో జనం కేవలం ఫ్యాన్ గుర్తుని చూసి మాత్రమే ఓటు వేశారు. ఈసారి ఎమ్మెల్యేలను చూసి, వారు చేసిన మంచి పనుల్ని చూసి ఓటు వేయాలనేది జగన్ ఆలోచన. కేవలం జగన్ సంక్షేమ కార్యక్రమాలే ప్రధాన కారణం కాకూడదు. నిత్యం తమకు అందుబాటులో ఉండే నాయకుడిని మనం గెలిపించుకున్నామన్న తృప్తి కూడా జనాలకి ఉండాలి. అందుకే పదే పదే ఎమ్మెల్యేలకు ఆయన జనాల్లో ఉండండి అని చెబుతున్నారు, గడప గడపకు వెళ్లండి అని పోరుపెడుతున్నారు. సైలెంట్ గా సర్వేలు చేయిస్తున్నారు.
సొంతంగా తమకు తామే అభ్యర్థులమంటూ ప్రకటించుకునేవారిని పక్కనపెడితే.. పక్కవాళ్లని అభ్యర్థులుగా ప్రకటించిన పెద్దిరెడ్డి కానీ, కొడాలి నాని కానీ.. అంత తేలిగ్గా అలా మాట్లాడతారని అనుకోలేం. జగన్ మనసులో ఉన్న మాటనే పరోక్షంగా వీళ్లు ముందుగా లీక్ చేశారంతే. అయితే ఇదే ఫైనల్ అని కూడా అనుకోలేం. చివర్లో జగన్ మార్పులు చేర్పులు చేసేందుకు అవకాశం లేకపోలేదు.
మొత్తమ్మీద వైసీపీ ప్లీనరీ సమావేశాలు అసంతృప్తుల్ని, అలకల్ని, వెన్నుపోటుల్ని పరోక్షంగా బయటపెడుతున్నాయి. అదే సమయంలో అభ్యర్థుల విషయంలో కూడా కాస్తో కూస్తో క్లారిటీ ఇస్తున్నాయి.