చిత్రవిచిత్ర నియామకాలకు వైసీపీ తెరలేపింది. ఏ నియామకాన్ని ఎందుకు చేపడుతున్నారో పార్టీ పెద్దలకైనా కనీసం అర్థమవుతోందో, లేదో తెలియని స్థితి. తాజాగా పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి (సర్వేపల్లి, వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు) జిల్లాల వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని నియమించారు. అయితే వైసీపీ కోఆర్డినేటర్ల నియామకంలో వైసీపీ చర్యలు విచిత్రంగా ఉన్నాయి.
తాజాగా విజయసాయిరెడ్డికి కొన్ని జిల్లాల సమన్వయకర్తగా నియమించారు. తిరుపతి జిల్లాలోని సర్వేపల్లి, వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాలను మళ్లీ పాత నెల్లూరు జిల్లాలోకి కలిపి ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అలాగే తిరుపతి జిల్లాలోని తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలను పాత చిత్తూరు జిల్లాలోకి కలిపి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది.
ప్రస్తుతం వైసీపీ కోఆర్డినేటర్ నియామకానికి వచ్చే సరికి, మళ్లీ పాత జిల్లాలనే పరిగణలోకి తీసుకోవడం వెనుక లాజిక్ ఏంటో అంతుచిక్కడం లేదని అంటున్నారు. ఈ మాత్రం సంబరానికి జిల్లాల పునర్వభజన ఎందుకు చేశారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
కొత్తగా ఏర్పరిచిన జిల్లాల ప్రకారమే సమన్వకర్తలను నియమించడం వల్ల వచ్చే ఇబ్బందులేంటని ఆ పార్టీకి చెందిన నాయకులు ప్రశ్నిస్తున్నారు. నిన్నమొన్నటి వరకూ కొత్త జిల్లాల ప్రకారమే పార్టీ నియామకాలున్నాయని, ఇప్పుడు ఏమైందని నిలదీస్తున్నారు.