పాదయాత్ర చేస్తే పదవులు వస్తాయా అంటే ఇది తెలుగు రాజకీయాలలో పలు మార్లు రుజువు అయింది. స్వామి కార్యం స్వకార్యం అన్న లెక్కన పాదయాత్రలు తెలుగు నాటి సాగిపోతున్నాయి. జనాలకు అందుబాటులో ఉన్నామన్న పేరుతో పాటు రాజకీయంగా పట్టు సాధించేందుకు పాదయాత్రలు పరమ పద సోపానంగా ఉపయోగపడుతున్నాయి.
అందుకే పాదయాత్రతో దేన్ని అయినా సాధించవచ్చు అని అగ్ర నేతల నుంచి లోకల్ లీడర్స్ దాకా భావిస్తున్నారు. విశాఖ సిటీలోని సౌత్ నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్పోరేటర్ మహమ్మద్ సాధిక్ ప్రజా ఆశీర్వాద పాద యాత్ర చేపట్టారు. ఆయన మొత్తం నియోజకవర్గం అంతా యాత్ర చేస్తున్నారు.
ప్రజలను ఆశీర్వదించమని కోరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని ప్రజలకు సేవ చేయాలన్నది ఆయన కోరిక. ప్రజలు ఆశీర్వాదం ఉంటే పార్టీ ఆశీర్వాదం కూడా ఉంటుందని తెలివిగానే పాదాలు కదుపుతున్నారు ఈ నేత. విశాఖ సౌత్ విషయానికి వస్తే మైనారిటీలు ఎక్కువగా ఉంటారు.
గతంలో ఇక్కడ నుంచి ఎస్ ఎ రహమాన్ టికెట్ తెచ్చుకుని గెలిచారు. దాంతో ఈసారి వైసీపీ తరఫున మైనారిటీ కోటాలో టికెట్ సాధించాలని సాధిక్ చూస్తున్నారు. అయితే వచ్చిన చిక్కల్లా ఈ సీటు ఆల్ రెడీ రిజర్వ్ అయిపోయిందన్న ప్రచారం సాగడమే.
టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కే 2024 ఎన్నికల్లో టికెట్ ఇస్తారని అంటున్నారు. ఆయన కూడా తరచూ ఇదే మాటను చెబుతున్నారు. అందువల్ల ఆశలు పెట్టుకున్నా అది సాగేది కాదని ఎమ్మెల్యే అనుచరుల వాదన. కానీ ఆశలు ఉంటాయి అందరికీ. రాజకీయ నేతలకు ఇంకా ఎక్కువగా ఆశలు ఉంటాయి.
రాజకీయాల్లో అసాధ్యం అన్నది లేదు ఎపుడు ఏది జరుగుతుందో ఎవరికీ తెలియదు. అందువల్ల కార్పోరేటర్ మహమ్మద్ సాధిక్ తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మొదటి నుంచి వైసీపీలో ఉన్న వారికే టికెట్ ఇవ్వాలని ఆయన డిమాండ్. పాదయాత్ర అయితే బాగానే సాగుతోంది. ప్రజాశీర్వాదం సంగతి పక్కన పెడితే పార్టీ పెద్దల ఆశీర్వాదం సంగతే చూడాలి.