ఆగస్ట్ 29 వ తేదీన నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా మన్మథుడు సినిమాను పలు చోట్ల రీరిలీజ్ చేశారు. నగర స్థాయి సెంటర్లలో ఈ సినిమాకు హౌస్ ఫుల్ కలెక్షన్లే దక్కాయని ట్రేడ్ రిపోర్ట్ చెబుతూ ఉంది. విశేషం ఏమిటంటే.. ఈ సినిమా దెబ్బకు వరుణ్ తేజ్ హీరోగా నటించి, విడుదలైన గాండీవధారి అర్జున కొన్ని చోట్ల థియేటర్ల నుంచి ఖాళీ చేసింది!
ఆగస్టు 25న గాండీవధారి అర్జున సినిమా థియేటర్లకు వచ్చింది. క్రిటికల్ రివ్యూలతో ఈ సినిమా తొలిరోజే నెగిటివ్ టాక్ పొందింది. ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్ లో డిజాస్టర్లలో ఒకటిగా నిలుస్తోంది. తొలి వారాంతానికే ఈ సినిమా అడ్రస్ గల్లంతయ్యింది.
శుక్రవారం వరుణ్ తేజ్ సినిమాను విడుదల చేసిన కొన్ని థియేటర్లు మంగళవారానికే దాన్ని పక్కకు పెట్టాయి. 29న రీరిలీజ్ కు నోచుకున్న మన్మథుడు వరుణ్ తేజ్ సినిమాకు మరో థ్రెట్ గా మారింది. మన్మథుడు సినిమాను 29న నాలుగు షో లు ఆడించి, ఆ మరుసటి రోజు నుంచి వరుణ్ తేజ్ సినిమాను కొనసాగించే ఆలోచన కొన్ని థియేటర్ల యాజమాన్యాలు చేసినట్టుగా ఉన్నాయి. అయితే.. తిరుపతి వంటి చోట కూడా మన్మథుడు నాలుగు షో లూ హౌస్ ఫుల్ గా ఆడింది.
దీంతో గాండీవధారి అర్జున ప్రదర్శనను మళ్లీ కొనసాగించడం కన్నా, మన్మథుడు ప్రదర్శననే కొనసాగించడం మేలని అనుకుని.. ఆ సినిమానే గత రెండు రోజులుగా కొనసాగిస్తూ ఉండటం గమనార్హం. ఒకరోజు కోసం అంటూ మన్మథుడును విడుదల చేసిన వాళ్లు, మూడు రోజులుగా అదే సినిమాను ఆడిస్తూ ఉన్నారు! మూలిగే నక్కపై తాటిపండు పడట్టుగా ఉంది ఈ పరిస్థితి!