ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టడంలో టీడీపీ, వైసీపీ దొందు దొందే. ఎంతసేపూ సొంత ప్రయోజనాల కోసం మోదీ సర్కార్ ఎదుట టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు గత పదేళ్లలో మోదీ సర్కార్ ఎదుట మోకరిల్లడం మినహా చేసిందేమీ లేదు. తనకు 25కు 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని ఎన్నికల ప్రచార సభల్లో జగన్ హోరెత్తించారు. జనం నమ్మి ఆయనకు పట్టం కట్టారు.
అయితే బీజేపీ సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిందని, మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించలేమని మొదట్లోనే జగన్ చేతులెత్తేశారు. కేంద్ర ప్రభుత్వం దయతలిచి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన చెప్పుకొచ్చారు. తాజాగా ప్రత్యేక హోదాపై మళ్లీ వైసీపీ మాట్లాడుతోంది. ఇవాళ రాజ్యసభలో వైసీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ టీడీపీని కార్నర్ చేయడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం టీడీపీకి వుందన్నారు. రాష్ట్రంతో పాటు కేంద్రంలో బీజేపీతో టీడీపీ అధికారం పంచుకుందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ కాదని, హక్కు అని ఆయన అన్నారు. కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని టీడీపీ అడగాలని ఆయన సూచించారు.
అలాగే రాజ్యసభలో మరో వైసీపీ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, లోక్‌సభలో అరకు వైసీపీ ఎంపీ తనూజారాణి కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. అలాగే ఏపీలో అధికార పార్టీ టీడీపీ హింసాయుత ఘటనలకు పాల్పడుతోందని విమర్శించారు.
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని కేంద్రంపై అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి చేస్తే తప్పక ప్రయోజనం వుంటుంది. అయితే నిజాయతీగా ఆ పని చేయాల్సి వుంటుంది.