ఏపీ సర్కార్ జారీ చేసిన జీవోపై తాత్కాలికంగా వ్యతిరేక ఆదేశాలు అయినప్పటికీ, రాజకీయంగా వైసీపీకి లాభించేదే. జీవో నంబర్-1ని ఈ నెల 23 వరకూ సస్పెండ్ చేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. చంద్రబాబు సభలలో చోటు చేసుకున్న అవాంఛనీయ పరిణామాల నేపథ్యంలో ప్రజల ప్రాణాలను రక్షించే ఉద్దేశంతో ఏపీ సర్కార్ జీవో నంబర్-1 తీసుకొచ్చింది. ఇది రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కీలక పాత్ర పోషించే టీడీపీకి బదులు, చంద్రబాబు జేబులో నాయకుడిగా విమర్శలు ఎదుర్కొంటున్న సీపీఐ రామకృష్ణ ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై ఇవాళ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. రాజకీయ పార్టీల భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రతిపక్షాల గొంతు నొక్కేలా జీవో వుందంటూ పిటిషనర్ రామకృష్ణ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో 23వ తేదీ వరకూ జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉందని డివిజన్ బెంచ్ అభిప్రాయ పడింది. ఇదిలా వుండగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 20వ తేదీకి కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది. దీంతో జీవోపై గత కొన్ని రోజులుగా సాగుతున్న రాజకీయ వివాదానికి తాత్కాలికంగా తెరపడినట్టైంది. ఇది ఒక రకంగా వైసీపీకి అనుకూలించే అంశమే.
ఎందుకంటే జీవో సాకుతో నిత్యం ఆందోళనలు, ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలు. ఇందుకు ప్రభుత్వమే అవకాశం కల్పించినట్టైంది. హైకోర్టు ఆదేశాలు… ఏపీ ప్రభుత్వానికి సాంకేతికంగా వ్యతిరేకమైనప్పటికీ, ప్రతిపక్షాల ఆందోళనలతో జీవో వెనక్కి తీసుకుందన్న అభిప్రాయానికి చోటు లేకపోయింది. ప్రతిపక్షాలు వైసీపీ సర్కార్‌పై వ్యతిరేక ప్రచారానికి కొత్త అంశాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి. హైకోర్టు తాజా ఆదేశాలతో అధికార పక్షం హమ్మయ్య అని మనసులో ఊరట పొంది వుంటుందేమో!