వైసీపీ ఎమ్మెల్యేల్లో తాడికొండ భ‌యం!

వైసీపీ ఎమ్మెల్యేల్లో తాడికొండ భ‌యం ప‌ట్టుకుంది. తాడికొండ‌లో అద‌న‌పు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్‌ను వైసీపీ అధిష్టానం నియ‌మించింది. ఈ నియామ‌కాన్ని తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి, ఆమె అనుచ‌రులు తీవ్రంగా…

వైసీపీ ఎమ్మెల్యేల్లో తాడికొండ భ‌యం ప‌ట్టుకుంది. తాడికొండ‌లో అద‌న‌పు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్‌ను వైసీపీ అధిష్టానం నియ‌మించింది. ఈ నియామ‌కాన్ని తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి, ఆమె అనుచ‌రులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. రానున్న ఎన్నిక‌ల్లో త‌న‌ను ప‌క్క‌న పెట్టే కుట్ర‌లో భాగంగా ఈ నియామ‌కం పార్టీ చేప‌ట్టింద‌ని శ్రీ‌దేవి ఆరోప‌ణ‌.

ఈ నేప‌థ్యంలో స‌ర్వే నివేదిక‌ల్లో బాగా నెగెటివ్ మార్కులు వ‌చ్చిన ఎమ్మెల్యేల స్థానాల్లో కొత్త వారికి బాధ్య‌త‌లు ఇవ్వాల‌నే ఆలోచ‌న‌లో వైసీపీ ఉన్న‌ట్టు చ‌ర్చ జ‌రుగుతోంది. తాడికొండ ఎపిసోడ్ పుణ్య‌మా అని త‌మ‌ను ఎక్క‌డ ప‌క్క‌న పెడ‌తారో అని అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ద‌డ మొద‌లైంది. మ‌రోవైపు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కొత్త జిల్లాల పార్టీ అధ్య‌క్షుల‌ను పిలిపించుకుని వాళ్ల ప‌రిధిలోని ఎమ్మెల్యేల‌పై ఇంటెలిజెన్స్‌, వివిధ సంస్థ‌ల స‌ర్వే నివేదిక‌ల గురించి చెబుతున్న‌ట్టు స‌మాచారం.

ఫ‌లానా ఎమ్మెల్యే ప‌నితీరు మెరుగుప‌ర‌చుకోవాల‌ని చెబుతూ నిర్దేశిత స‌మ‌యం ఇస్తున్నార‌ని తెలిసింది. దీంతో ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తుతున్నాయి. తిరుప‌తి జిల్లాలో కొంత మంది ఎమ్మెల్యేల ప‌నితీరుపై జ‌గ‌న్ తీవ్ర అస‌హ‌నంగా ఉన్నార‌ని తెలిసింది. ప‌నితీరు మార్చుకోవాల‌ని సంబంధిత ఎమ్మెల్యేల‌కు పార్టీ పెద్ద‌ల నుంచి హెచ్చ‌రిక‌లు వెళ్లాయి.

దీంతో త‌మ‌కు వైసీపీలో నూక‌లు చెల్లుతాయోమో అనే భ‌యం ఆ ఎమ్మెల్యేల్లో ఉంది. తాడికొండ ఉదంతాన్ని చూపుతూ… బాగా చేసుకోక‌పోతే, అదే గ‌తి ప‌డుతుంద‌ని వైసీపీ పెద్ద‌లు హెచ్చ‌రిస్తున్నార‌ని తెలిసింది.  బితుకుబితుకుమంటూ ఎమ్మెల్యేలు జ‌నంలోకి వెళుతున్నారు.