దేవేంద‌ర్‌కు గుట్టుగానా…ఇదెక్క‌డి చోద్యం!

టీడీపీ అనుకూల ప‌త్రిక ఇవాళ వైసీపీ నాయ‌కుడు గుర్రంపాటి దేవేంద‌ర్‌రెడ్డిపై ఆస‌క్తిక‌ర త‌ప్పుడు క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఈయ‌న గారికి ఏపీ ప్ర‌భుత్వం గుట్టుగా అటవీ అభివృద్ధి సంస్థ  (ఏపీఎఫ్‌డీసీ) చైర్మ‌న్ ప‌ద‌విని గుట్టుగా క‌ట్ట‌బెట్టింద‌నేది…

టీడీపీ అనుకూల ప‌త్రిక ఇవాళ వైసీపీ నాయ‌కుడు గుర్రంపాటి దేవేంద‌ర్‌రెడ్డిపై ఆస‌క్తిక‌ర త‌ప్పుడు క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఈయ‌న గారికి ఏపీ ప్ర‌భుత్వం గుట్టుగా అటవీ అభివృద్ధి సంస్థ  (ఏపీఎఫ్‌డీసీ) చైర్మ‌న్ ప‌ద‌విని గుట్టుగా క‌ట్ట‌బెట్టింద‌నేది ఆ క‌థ‌నం సారాంశం. మ‌రీ ఇంత నిర్ల‌జ్జ‌గా క‌థ‌నం వండ‌డం, దాన్ని అచ్చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. తాము రాస్తున్న అంశంలో కొంత నిజం వుంటే, దానికి కొంత మేర‌కు అబ‌ద్ధాల మెరుగులు దిద్దినా అర్థం చేసుకోవ‌చ్చు. అస‌లు క‌థ‌న‌మే ఫేక్ అని… ఎలాంటి వివ‌రాలు లేకుండా రాసిన క‌థ‌నం చెప్ప‌క‌నే చెబుతోంది.

అస‌లు ఈ క‌థ‌నం ఇప్పుడు రావ‌డానికి కార‌ణాన్ని, అక్క‌సును స‌ద‌రు ప‌త్రిక ఎక్క‌డా దాచుకోలేదు. లోకేశ్‌ను దూషించిన మ‌రుస‌టి రోజే గుర్రంపాటి దేవేంద‌ర్‌రెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించార‌ని రాసుకొచ్చారు. లోకేశ్‌ను జూమ్‌లో దేవేంద‌ర్ ప్ర‌శ్నించాడు కాబ‌ట్టి, ఆయ‌న‌పై ఏదో ఒక క‌థ‌నాన్ని అచ్చేయాల‌నే కుట్ర నుంచి పుట్టుకొచ్చిందే ఈ క‌థ‌నం. ఏపీఎఫ్‌డీసీ చైర్మ‌న్‌గా దేవేంద‌ర్‌రెడ్డిని నియ‌మిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 28న ప్ర‌భుత్వం నియామ‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ సంద‌ర్భంగా జీవో ఎమ్ఎస్ నంబ‌ర్ 21 విడుద‌ల చేసింది. ఇందులో ర‌హ‌స్యం ఏముంది?

లోకేశ్ జూమ్ ఎపిసోడ్ ఈ నెల 9న చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలు కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీల‌తో పాటు గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి, వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్ ర‌జిని పాల్గొన్నారు. లోకేశ్‌ను దేవేంద‌ర్‌రెడ్డి నిల‌దీశారు. చంద్రబాబు, లోకేశ్‌పై తిట్ల దండకం చదివిన మరుసటి రోజే నియామక ఉత్తర్వులు ఆయన చేతిలో పెట్టి, పదవీ బాధ్యతలు అప్పగించడం గమనార్హమ‌ని రాయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.  

వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత చాలా మందికి ప‌ద‌వులు వ‌చ్చిన‌ట్టే, దేవేంద‌ర్‌రెడ్డికి కూడా అదృష్టం త‌లుపు త‌ట్టింది. ప్ర‌భుత్వ డిజిట‌ల్ డైరెక్ట‌ర్‌గా నియ‌మించ‌డం పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే ఏ ప్ర‌భుత్వంలోనైనా నియామ‌కాల‌కు అర్థంప‌ర్థం ఉండ‌దు.

రాష్ట్రానికి, పార్టీకి సంబంధం లేని వ్య‌క్తులు రాజ్య‌స‌భ లాంటి ఉన్న‌త ప‌ద‌వులు ద‌క్కించుకుంటుంటే, పాపం దేవేంద‌ర్ డిజిట‌ల్ డైరెక్ట‌ర్‌, ఆ త‌ర్వాత అట‌వీ అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ ప‌ద‌వులు ద‌క్కించుకుంటే బాధ ఎందుకు? ప్ర‌జ‌ల‌తో కాకుండా నేరుగా పార్టీ పెద్ద‌ల‌తో సంబంధాలు పెట్టుకోవడం వ‌ల్ల ఫ‌లితం ద‌క్కుతుంద‌ని త‌న రాజ‌కీయ పంథా ద్వారా మెసేజ్ ఇవ్వ‌డ‌మే  దేవేంద‌ర్‌రెడ్డి చేసిన త‌ప్పా? ఆన్స‌ర్ ఫ్లీజ్‌!

సొదుం ర‌మ‌ణ‌