బాబు కోసం…బిత్త‌ల నిల‌బ‌డ్డ ఎల్లో మీడియా!

తాము అధికారంలోకి వ‌స్తే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని క‌ట్ డ్రాయ‌ర్‌పై నిల‌బెడ్తాన‌ని నారా లోకేశ్ చేసిన కామెంట్స్ తీవ్ర రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. అలాగే గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీని కూడా ఇంత‌కంటే…

తాము అధికారంలోకి వ‌స్తే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని క‌ట్ డ్రాయ‌ర్‌పై నిల‌బెడ్తాన‌ని నారా లోకేశ్ చేసిన కామెంట్స్ తీవ్ర రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. అలాగే గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీని కూడా ఇంత‌కంటే దారుణంగా ఆ పార్టీ నాయకులు తిట్టిపోశారు. టీడీపీ అధికారంలోకి రావ‌డం, కొడాలి, వ‌ల్ల‌భ‌నేనిల‌ను ఏం చేస్తార‌నేది ఊహాజ‌నితం. వాటిని కాసేపు ప‌క్క‌న పెడ‌దాం.

చంద్ర‌బాబు కోసం ఎల్లో మీడియాధిప‌తులు మాత్రం నడివీధిలో బిత్త‌ల నిల‌బ‌డ్డానికి కూడా సిగ్గుప‌డ‌డం లేదు. ఇండియా టుడే- సీ ఓట‌ర్ స‌ర్వే పేరుతో ఓ న‌కిలీ నివేదిక‌ను నిస్సిగ్గుగా ఎల్లో చాన‌ళ్లు, ఓ ప‌త్రిక ప్ర‌చారం చేయ‌డం వారి దిగ‌జారుడుత‌నానికి నిద‌ర్శ‌నంగా చెప్పొచ్చు. బాబుకు రాజ‌కీయ ల‌బ్ధి క‌లిగించేందుకు విలువ‌ల వ‌లువ‌ల‌ను వీడి, దిగంబ‌రంగా ఆ మీడియా సంస్థ‌లు త‌ప్పుడు క‌థ‌నాల‌ను వండివార్చ‌డం మ‌రెవ‌రికీ సాధ్యం కాని విద్య అనే వ్యంగ్య కామెంట్స్ వినిపిస్తున్నాయి.

టీడీపీ ఒంట‌రిగా పోటీ చేసినా 15 లోక్‌స‌భ సీట్ల‌లో గెలుస్తుంద‌ని, వైసీపీ కేవ‌లం 3 లేదా 4 సీట్ల‌కు ప‌రిమితం అవుతుంద‌నే త‌ప్పుడు క‌థ‌నాల‌ను రాయ‌డం ద్వారా… నిరుత్సాహంలో ఉన్న టీడీపీలో జోష్ నింపే కుట్ర క‌నిపిస్తోందని వైసీపీ నేత‌లు విమర్శిస్తున్నారు. ఇండియా టుడే-సీ ఓట‌ర్ స‌ర్వేను మ‌రో ఎల్లో ప‌త్రిక ఈనాడు ప‌త్రిక ప్ర‌చురించ‌క‌పోవ‌డం దాని తోక ప‌త్రిక నిజ స్వ‌రూపాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసింది.

ఇండియా టుడే-సీ ఓట‌ర్ స‌ర్వే నిజం కాద‌నే సంగ‌తిని ఈనాడు ప‌త్రిక ప్ర‌చురించ‌క‌పోవ‌డం ద్వారా లోకానికి చాటి చెప్పింది. బాబు ప‌ల్ల‌కి మోయ‌డంలో రామోజీరావు మీడియా తెగ ఉత్సాహం చూపుతోంది. మొద‌టి నుంచి చంద్ర‌బాబు భ‌జ‌న చేస్తున్న ఈనాడు… తాజా టీడీపీ అనుకూల స‌ర్వేని ప్రచురించ నిరాక‌రించ‌డంతో వాస్త‌వం ఏంటో వాళ్ల‌లో వాళ్లే బ‌య‌ట పెట్టుకున్న‌ట్టైంది. 

కానీ వారాంత‌పు ప‌లుకుల సార్‌కు వైసీపీ వ్య‌తిరేక వార్త అయితే చాలు….నిజానిజాల‌తో సంబంధం లేదు. ఎద్దు ఈనిందంటే గాట‌న క‌ట్టేయ‌మ‌నే జ‌ర్న‌లిజం పోక‌డ‌ల‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలుస్తూ, ఇండియా టుడే పేరుతో త‌ప్పుడు స‌ర్వే నివేదిక‌ను ప్ర‌చురించి త‌న దిగంబ‌ర‌త్వాన్ని నిస్సిగ్గుగా ప్ర‌ద‌ర్శించార‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. దీనికి తోడు మ‌రో ఎల్లో చాన‌ల్ కూడా ఇదే రీతిలో స‌ర్వే పేరుతో త‌న అశ్లీల‌త‌ను ప్ర‌ద‌ర్శ‌న‌కు పెట్టింద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి.