చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ శవాలు లేస్తుంటే దాన్ని ఎలా కవర్ చేయాలో తెలియక ఆ పాపం పోలీసులపై నెట్టేసి ఆంధ్రజ్యోతి చేతులు కడిగేసుకుంది. వాళ్లు పట్టించుకోకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందట. టీడీపీ కార్యక్రమాలు విఫలమయ్యేలా వ్యూహాలు రచిస్తున్నారట! పోలీసులు విఫలం చేస్తే విఫలమయ్యే పార్టీ కూడా ఒక పార్టీనేనా?
ఈ పత్రిక రాతలు ఎలా వుంటాయంటే అన్ని వేల మంది హాజరైతే అక్కడ పోలీసులే కనపడలేదట. 200 మందిని నియమించినట్టు తర్వాత ప్రకటించారట. కనీసం 2 వేల మందిని నియమించాల్సి వుందట. ఎవడో పనీపాటా లేనోడు చీరలు పంచుతానని ప్రచారం చేస్తే 2 వేల మంది పోలీసులు వెళ్లి విధులు నిర్వహించాలని ఆంధ్రజ్యోతి కోరిక.
అసలు వాస్తవం ఏమంటే తన సభలకి వేలాది మంది ఉప్పెనలా కదిలి వస్తున్నారని జగన్ వ్యతిరేకత ప్రారంభమైందని ప్రచారం చేసుకోడానికి బాబు భజన బృందం స్కెచ్ వేసింది. కావాల్సినంత మంది సినిమా వాళ్లు పార్టీలో వున్నారు. కాబట్టి గ్రాఫిక్స్ రహస్యాలు ఇతరుల కంటే బాగా తెలుసు కాబట్టి ఇరుకు ప్రాంతాల్లో సభలు నిర్ణయించారు. అక్కడైతే వెయ్యి మంది వస్తే 10 వేల మంది ఎఫెక్ట్ వస్తుందని అంచనా వేసి కందుకూరు సభలో జనం ప్రాణం తీసారు. అక్కడితో బుద్ధి తెచ్చుకోకుండా గుంటూరులో మళ్లీ ఉసురు తీసారు.
బటన్ నొక్కుడు అని జగన్ని ఎద్దేవా చేసే బాబు ఒక తేడాని అర్థం చేసుకోవాలి. జనాల్ని బిచ్చగాళ్లులా జగన్ ఏనాడూ రోడ్డు మీద నిలబెట్టలేదు. ఇంటికే పెన్షన్ చేరుతుంది. బ్యాంక్ ఖాతాకి పథకాలు చేరుతాయి. చివరికి రేషన్ సరుకుల కోసం కూడా దుకాణాల ముందు పడిగాపులు గాసే పనిలేదు. మరి బాబు నిర్వాకం ఏమిటి?
ప్రాణం అందరిదీ ఒకటే. చంద్రబాబుది అయినా, పేద మహిళలదైనా ఒకటే. డబ్బులిస్తే తిరిగి రాదు. ఒక కొడుక్కి తల్లిని, ఒక మనుమరాలికి అమ్మమ్మని ఎప్పటికీ తీసుకురాలేవు. ఇకనైనా ప్రాణాల్ని గౌరవించు. నీ సభకి ఎంత మంది జనాలు వచ్చినా నువ్వు గెలవలేవు. నీ నిర్వాకం ఏళ్ల తరబడి చూశారు, మళ్లీ నెత్తికి తెచ్చుకోరు.
ఆంధ్రజ్యోతి తెలుసుకోవలిసింది ఏమంటే నీ దృష్టిలో బాబు ఇంద్రుడు, చంద్రుడే కావచ్చు. కానీ జర్నలిస్ట్ కనీస నియమావళి ఒకటుంది. ఒకవేళ జగన్ సభలో వరుసగా దుర్ఘటనలు జరిగితే నీ కవరేజ్ ఏ రేంజ్లో వుండేదో అందరికీ తెలుసు. పూర్తిగా ఒక వైపు వుండడమే నీ ఎజెండా అయితే తప్పులేదు. కానీ పదేపదే నిష్పాక్షికత, ప్రజాస్వామ్యం అనే పదాలను ఉపయోగించకు. నీ పత్రికలో వాటిని నిషేధించు.