ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఏమైనా అంటకడతారనేందుకు తాజా ఉదాహరణ ఇది. ఏపీలోనే కాదు, దేశ విదేశాల్లో అసాంఘిక, నేరమయ ఘటనలు జరిగితే వాటికి జగన్‌తో ముడిపెట్టడం టీడీపీకే చెల్లింది. కనీసం నవ్విపోతారన్న స్పృహ కూడా లేకపోవడం గమనార్హం. తాము ఏమి చెప్పినా జనం నమ్ముతారనే భావనో లేక ఎలాగైనా నమ్మించగలమన్నా విశ్వాసమో తెలియదు కానీ, నోటికొచ్చినట్టు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఆ మాటల్లో నిజానిజాలతో సంబంధం లేకుండా ప్రచురించే, ప్రసారం చేసే మీడియా టీడీపీ అడ్డగోలు వాదనను ప్రోత్సహిస్తున్నట్టైంది.
థాయ్‌లాండ్‌లో ఒక హోటల్‌లో చీకోటి ప్రవీణ్ సారథ్యంలో జూదం ఆడిస్తుండగా అక్కడి పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌తో పాటు 100 మంది భారతీయులు పట్టుబడ్డారు. వీరిలో 83 మంది భారతీయులున్నారు. వీరంతా పట్టుబడడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేల ధనదాహమే కారణమని టీడీపీ జాతీయ ప్రతినిధి ఆరోపించడం, దానికి టీడీపీ మీడియా ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.
గుడివాడలో క్యాసినో నిర్వహించారని, అప్పుడే తాము ఫిర్యాదు చేసినప్పుడు చర్యలు తీసుకుని వుంటే… ఇవాళ ఇంత మంది భారతీయులు పట్టుబడి వుండేవారు కాదని టీడీపీ ఆరోపిస్తోంది. కమీషన్లకు కక్కుర్తి పడి చీకోటి ప్రవీణ్ లాంటి వారిని జగన్ ప్రోత్సహించారని ఆరోపించడం వారికే చెల్లింది. వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీల ధనదాహానికి భారతీయులు బలి పశువులు అయ్యారని కళ్లు మూసుకుని ఆరోపించారు.
ఏపీలోనే కాదు, దేశ విదేశాల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాలన్నీ జగన్ ప్రోత్సాహంతోనే సాగుతున్నాయని చెప్పడం టీడీపీ నేతలకే చేతనవుతుంది. చెడు అంతటికీ జగనే కారణమని, మంచైతే చంద్రబాబు గొప్ప అని ప్రచారం చేసుకోవడం టీడీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. థాయ్‌లాండ్‌లో చీకోటి ప్రవీణ్‌తో పాటు పెద్ద సంఖ్యలో భారతీయులు జూదం ఆడుతూ ఆ దేశ పోలీసులకు పట్టుబడడానికి జగనే కారణం అని విమర్శిస్తున్నారంటే, ఇక వివేకా హత్యతో ముడిపెట్టడం పెద్ద విషయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రానున్న రోజుల్లో దేశ, విదేశాల్లో సాగే అసాంఘిక, నేరపూరిత కార్యకలాపాలన్నీ జగన్‌కు ముడిపెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఆ విద్యలో టీడీపీ పీహెచ్‌డీ చేసింది. ఆ పార్టీకి ఎల్లో మీడియా అండ ఉంది. చంద్రబాబు ప్రయోజనాల కోసం ఎలాంటి రాతలైనా ప్రచురించడానికి, అలాగే కథనాలు ప్రసారం చేయడానికి ఆ మీడియా వెనుకాడదు. టీడీపీ ధైర్యం కూడా అదే.