వైసీపీలో బలమైన నేతల్ని టార్గెట్ చేయడమే టీడీపీ, ఎల్లో మీడియా ప్రధాన ఎజెండా. అయితే ఎల్లో బ్యాచ్ వ్యూహాల గురించి వైసీపీ నేతలకే కాదు, జనానికి కూడా బాగా తెలిసొచ్చాయి. జగన్‌కు అండగా నిలిచే నాయకుల్ని టార్గెట్ చేయడం ద్వారా, మానసికంగా బలహీనపరిచి, ఇతరులకు ఒక హెచ్చరిక చేయాలనేది ఎల్లో టీమ్ ఎత్తుగడ. ఇలాంటి అరిగిపోయిన వ్యూహాల్ని చూసిచూసి వైసీపీ అలిసిపోయింది. ఎల్లో మీడియాలో వైసీపీ నేతలపై పదేపదే రాస్తున్నారంటే, ఓహో వీళ్లు జగన్‌కు గట్టి మద్దతుదారులుగా నిలిచారనే అభిప్రాయంతో ప్రజలున్నారు.
తాజాగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డే ఉదాహరణ. ఈవీఎం ధ్వంసానికి సంబంధించి ఆయన వీడియో బయటికొచ్చిన మొదలు, ఇక ఏ వార్తాంశం లేదన్నట్టు తీవ్రస్థాయిలో కథనాలు పుట్టుకొస్తున్నాయి. ఈవీఎంలను ధ్వంసం చేయడాన్ని ఎవరూ సమర్థించరు. ఇదే సందర్భంలో పిన్నెల్లి చేస్తే తప్పు, టీడీపీ నేతలు చేస్తే ఒప్పు అనడంపైనే పేచీ. పల్నాడులో టీడీపీకి అనుకూల గ్రామాల్లో యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడినా ఈసీ స్పందించడం లేదు.
అలాగే టీడీపీ అరాచకాల గురించి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా ఈసీకి చీమకుట్టినట్టైనా లేదు. ఇవన్నీ జనానికి తెలుసు కాబట్టే, ఎల్లో మీడియా ఏం రాసినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ ఎన్నికల ప్రక్రియలో ఈసీ అభాసుపాలైందన్నది నిజం.
ఇదిలా వుండగా వైసీపీ నేతలే కాదు, ఉన్నతాధికారుల్ని కూడా ఎల్లో మీడియా విడిచి పెట్టడం లేదు. సీఎస్ జవహర్‌రెడ్డి, అలాగే కొందరు కలెక్టర్లు, ఎస్పీలను కూడా భయపెట్టి లొంగదీసుకోడానికి ప్రయత్నించడం కొన్ని నెలలుగా చూస్తున్నాం. ఎల్లో మీడియాలో కథనాలు రాస్తే… భయపడే దానికి కాలం చెల్లింది. ఏ రాతల వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయో చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారు. అందుకే ప్రజలు కూడా ఎల్లో మీడియాను లైట్ తీసుకున్నారు.
దీంతో ఎల్లో మీడియా వైసీపీ టార్గెట్‌గా ఎన్ని రకాలుగా కథనాలు రాసినా ప్రజాభిప్రాయంలో మార్పు తీసుకురాలేకున్నారు. ఎల్లో మీడియా కథనాల్నే నమ్మి వుంటే, చివరికి పులివెందులలో జగన్ కూడా గెలిచే పరిస్థితి వుండదు. ప్రజల్లో చైతన్యం పెరిగింది. సాంకేతిక రంగం అభివృద్ధి పుణ్యమా అని సోషల్ మీడియా శక్తిమంతంగా తయారైంది. దీంతో ఎల్లో మీడియా ఆగడాలకు అడ్డుకట్ట పడింది. నిజానిజాలేంటో వెంటనే కళ్లకు కడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఎల్లో మీడియా తన మార్క్ టార్గెట్ చేస్తున్నా, తిప్పికొట్టే వ్యక్తులు, శక్తులు బలంగా ముందుకొచ్చాయి. ఇదే జగన్‌కు శ్రీరామ రక్ష.