తాము చెప్పినట్టు వినకపోతే… ఏ ఒక్కర్నీ వదలమన్నట్టుగా రామోజీ మీడియా వ్యవహరిస్తోంది. ఇంతకాలం ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ఎల్లో బ్యాచ్ తీవ్రస్థాయిలో టార్గెట్ చేసింది. వాళ్లిద్దరూ అవే స్థానాల్లో కొనసాగితే, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగి ఆశించిన రాజకీయ లబ్ధి జరగదని ఎల్లో టీమ్ కుట్రలకు తెరలేపింది. దీంతో సీఎస్, డీజీపీలపై నిత్యం ఏదో ఒక సాకుతో వ్యతిరేక కథనాలు ఎల్లో మీడియా రాసింది.
అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో వాళ్లిద్దరినీ మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాయించిన ఘనత చంద్రబాబుకే దక్కింది. పనిలో పనిగా ఆధారాలుగా ఎల్లో మీడియా కథనాలను ఫిర్యాదుకు జత చేయడం కొసమెరుపు. అయినప్పటికీ ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. దీంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిపై అక్కసు వెళ్లగక్కుతూ రామోజీ పత్రిక కథనం రాసింది.
ఈ కథనంలో సామాజిక పింఛన్లను ఇళ్ల వద్ద పంపిణీ చేయకపోవడంతో కూటమికి తీవ్ర నష్టం జరుగుతోందనే ఆందోళన కనిపించింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా తాము చెప్పినట్టు పని చేయకపోవడంతో, అసలు ఆయన ఏ పని చేయడం లేదంటూ ఎల్లో పత్రిక రాసుకొచ్చింది. ముకేశ్‌కుమార్ మీనా చర్యలన్నీ వైసీపీకి రాజకీయంగా లబ్ధి కలిగించేలా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
అలాగే సీఎస్, డీజీపీలపై కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేక నివేదికలను ముకేశ్‌కుమార్ మీనా పంపలేదని రామోజీ పత్రిక నిప్పులు చెరిగింది. దీంతో ప్రతిపక్షాలు ఎన్ని ఫిర్యాదులు చేసినా కేంద్ర ఎన్నికల సంఘం వాళ్లిద్దరినీ మార్చలేదని ఎల్లో పత్రిక కన్నీటిపర్యంతమైంది.
సామాజిక పింఛన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దే చేపట్టకుండా, వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ… ఆ బురదను విపక్షాలపై చల్లే కుట్రను సీఎస్‌ను అడ్డు పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్నారంటూ రాసుకొచ్చింది. సీఈవో మీనా దీన్ని ఆపలేదు సరికదా, పింఛన్ల వ్యవహారం తమ దృష్టిలో పరిష్కారమైన అంశమని ప్రకటించడం ఏంటని ఎల్లో పత్రిక ప్రశ్నించింది.
ఇంటి వద్దకు పింఛన్ పంపిణీ చేయాలని సీఎస్‌కు ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వలేదు. పాత ఆదేశాలనే పునరుద్ఘాటించిందనే నిజాన్ని మాత్రం రాయడం విశేషం. ఎన్నికల సంఘం ఆదేశాలను జగన్ ప్రభుత్వం పాటిస్తోందనే వాస్తవాన్ని ప్రజలకు ఈనాడు పత్రిక చెప్పడం గమనార్హం. ఏది ఏమైనా పింఛన్ల వ్యవహారంలో కూటమికి తీవ్ర నష్టం వాటిల్లుతోందనే ఆవేదన, ఆగ్రహం ఎల్లో పత్రికలో కనిపించింది. దీనంతటికి ముకేశ్‌కుమారే కారణమని, ఆయన్ను టార్గెట్ చేయడాన్ని చూడొచ్చు.