తమ మేనిఫెస్టోపై చివరికి చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌కు కూడా నమ్మకం లేనట్టుంది. అందుకే మేనిఫెస్టోపై ప్రచారం పక్కన పెట్టి, జగన్ అంటే జనంలో భయాన్ని సృష్టించి తద్వారా ఓట్లు రాబట్టుకోవాలనే ప్రయత్నం ఆ ఇద్దరు నేతల్లో కనిపిస్తోంది. ఇందుకు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని బాబు, పవన్ అస్త్రంగా వాడుతున్నారు. ఒకవేళ జగన్‌కు ఓట్లు వేస్తే, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేసి, మీ భూములు లాక్కుంటారని జనాన్ని భయపెట్టేందుకు చంద్రబాబు, పవన్ ప్రయత్నిస్తున్నారు.
గత ఐదేళ్లలో జగన్‌పై ఇలాంటి ప్రచారాలు ఎన్నెన్నో చేశారు. అయినప్పటికీ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక, వైసీపీ మాటల్లో చెప్పాలంటే గుంపుగా వచ్చారు. ఇప్పటికీ జగన్‌ను ఓడిస్తామనే ధీమా కూటమి నేతల్లో కనిపించకపోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం భూములకు మరింత రక్షణ కల్పించేందుకు జగన్ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచన చేస్తోంది.
ఇంకా ఈ చట్టం అమలు ఆలోచన దశలోనే వుంది. అయితే దీన్ని అడ్డం పెట్టుకుని జగన్ సర్కార్‌ను రాజకీయంగా కాల్చేసేందుకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు. ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టోను గాలికి వదిలేశారు. సంక్షేమ పథకాలు తమకు ఓట్లు రాల్చవనే నిర్ణయానికి బాబు, పవన్ వచ్చినట్టున్నారు. ఎందుకంటే… సంక్షేమానికి వైఎస్ జగన్ బ్రాండ్ అంబాసిడర్‌గా మిగిలారు.
తామెన్ని చెప్పినా జగన్‌ను కాదని, నమ్మరనే భావన బాబు, పవన్‌లో ఏర్పడింది. దీంతో జగన్‌పై వ్యతిరేకతతో అధికారాన్ని హస్తగతం చేసుకునే ఎత్తుగడకు బాబు, పవన్ పావులు కదుపుతున్నారు. జగన్ అంటే జనంలో బాగా భయం పుట్టి, ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు వేయాలంటే ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఒక్కటే ఆయుధమని వారు నమ్ముతున్నారు. అందుకే ఎల్లో మీడియా సైతం ఆ చట్టం కేంద్రంగానే విస్తృతంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తోంది. ఈ ప్రయత్నంలో చంద్రబాబు, పవన్ ఏ మేరకు సక్సెస్ అవుతారో మరి!