రెండు నెలల క్రితం విశాఖ రావాల్సిన ప్రధాని నరేంద్ర మోడీ టూర్ లేట్ అయినా ఎన్నికల ముందు లేటెస్ట్ గా వస్తున్నారు. ఆయన ఈ నెల 6న అనకాపల్లి సభకు హాజరవుతున్నారు. టీడీపీ కూటమికి అనుకూలంగా ఆయన ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అనకాపల్లి వస్తున్న నరేంద్ర మోడీ అన్నీ మాట్లాడుతారు అని అనుకోవచ్చు. అయితే రెండు విషయాలకు ఆయన నోరు విప్పి జవాబు చెబుతారా అని ప్రజా సంఘాలు మేధావులు ప్రశ్నిస్తున్నారు. సరిగ్గా అయిదేళ్ళ క్రితం అప్పటి ఎన్నికల సభలో విశాఖకు రైల్వే జోన్ ఇచ్చేశామని మోడీయే చెప్పారు. కానీ ఇంతవరకూ అది జీవోలలోనే ఉంది తప్ప ఆచరణకు ఎందుకు నోచుకోలేదో ప్రధాని చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలని స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు కార్మికులు కోరుతున్నారు. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తామని మూడేళ్ళ క్రితం ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించిందని ఆనాటి నుంచి ఉద్యమిస్తున్నా కనీసంగా కూడా ఈ విషయం పట్టించుకోలేదని వారు అంటున్నారు. పైపెచ్చు స్టీల్ ప్లాంట్ ని మరింతగా నిర్వీర్యం చేసే కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాని మోడీ అనేక అంశాల మీద జనరంజకమైన ఉపన్యాసం చేస్తారు కానీ జనాలకు పనికి వచ్చే ఈ రెండు విషయాల మీద మాట్లాడితే బాగుంటుందని అది విశాఖ ప్రగతికి దోహదపడుతుదని అంటున్నారు. మోడీ చేత ఈ విషయాల మీద మాట్లాడేలా చేయాల్సిన బాధ్యత టీడీపీ జనసేన తీసుకోవాలని కూడా కోరుతున్నారు.