రాజమండ్రిలో ప్రజాచైతన్యం కాస్త ఎక్కువే ఉన్నట్టుంది. అందుకే రాజమండ్రి రూరల్ కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యను ప్రజానీకం నిలదీసింది. ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమండ్రిలోని 27వ డివిజన్‌కు మందీమార్బలంతో బుచ్చయ్య వెళ్లారు.
ఒక్కసారిగా ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికలొస్తేనే గుర్తుకొస్తామా? ఇంతకాలం ఎక్కడికి పోయావ్? ఏమయ్యావ్? అంటూ డివిజన్ వాసులు నిలదీశారు. దీంతో బుచ్చయ్యతో పాటు వెంట ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు అవాక్కయ్యారు. బుచ్చయ్య ఏదో నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
ఎమ్మెల్యేగా గెలిచాక మీరు అసలు కనపడరని ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాకు వెళ్లిపోతారని, తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని నిలదీశారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలు గుర్తుకు వస్తారని వారు చీవాట్లు పెట్టారు. దీంతో బుచ్చయ్య చౌదరి వెంట ఉన్న కొందరు నాయకులు దబాయించే ప్రయత్నం చేశారు. దీంతో ప్రజలు మరింత రెచ్చిపోయారు. అసలు మీరెవరంటూ నిలదీశారు. ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.
నిలదీస్తున్న ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో కూడా బుచ్చయ్యకు దిక్కుతోచలేదు. ప్రజలకు ఏదో ఒక సంజాయిషీ చెప్పుకోడానికి ప్రయత్నించినా, ప్రజల నుంచి సానుకూలత వ్యక్తం రాలేదు. దీంతో తనపై ప్రజా వ్యతిరేకత వుందని బుచ్చయ్య అర్థం చేసుకుని, నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నారు. రాజమండ్రి రూరల్ సీటును జనసేన నుంచి బుచ్చయ్య లాక్కున్నారని కాపుల్లో తీవ్ర ఆగ్రహం వుంది. ఇప్పుడది ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో ఏమవుతుందో చూడాలి.