ఉచితాలను సంస్కరిస్తే ఏడుపు ఎందుకు?

ప్రభుత్వాలు పేదల కోసం ఉచిత పథకాలు ఏర్పాటు చేస్తే గగ్గోలు పెట్టే వాళ్ళు కొందరు ఉంటారు. పేదల జీవితాలు బాగుపడాలంటే ఎంతకాలం గడిచినా సరే అవసరాలను బట్టి ఉచిత పథకాలు ఉండాల్సిందే అని వాదించే…

ప్రభుత్వాలు పేదల కోసం ఉచిత పథకాలు ఏర్పాటు చేస్తే గగ్గోలు పెట్టే వాళ్ళు కొందరు ఉంటారు. పేదల జీవితాలు బాగుపడాలంటే ఎంతకాలం గడిచినా సరే అవసరాలను బట్టి ఉచిత పథకాలు ఉండాల్సిందే అని వాదించే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. అయితే వేలకు వేలు లక్షలకు లక్షలు రూపాయలు ఉచిత పథకాల రూపేణా లబ్ధిదారులకు వ్యక్తిగతంగా ఇస్తున్నప్పుడు.. దానికి కొన్ని నియమాలను ఏర్పాటు చేయడం అవసరం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే పని చేస్తోంది. కానీ నియమాలు పెట్టడమే ఒక పెద్ద నేరం అయినట్లుగా పచ్చ మీడియా చెలరేగిపోయి వార్తాకథనాలను అందిస్తోంది.

వివరాల్లోకి వెళితే పేదల కుటుంబాలలో అమ్మాయిలకు పెళ్లి చేసేందుకు ఆర్థిక సహాయం అందించే కళ్యాణమస్తు, షాదీ ముబారక్ పథకాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ ప్రారంభించింది. అయితే ఇదివరకటిలాగా అడ్డగోలుగా కేవలం రేషన్ కార్డు మాత్రమే ప్రాతిపదికగా ఎడాపెడా నిధులు పంచిపెట్టేసే కార్యక్రమంగా కాకుండా కొన్ని నిబంధనలను కూడా ఏర్పాటు చేసింది. ఇవన్నీ కూడా చాలా సహేతుకమైన నిబంధనలు. కాకపోతే అసలు సంక్షేమ పథకాన్ని అమలు చేయడంలో.. నిబంధన పెట్టడమే ఒక పాపం అన్నట్లుగా విమర్శలను జోరెత్తించడం హేయం!

ఇంతకీ ప్రభుత్వం పెట్టిన నిబంధనలు, కొత్తగా జత చేసిన విషయాలు మరి దారుణాలేమీ కాదు. వధూవరులు ఇద్దరు కూడా పదో తరగతి పాసై ఉండాలి.. అని ఒక నిబంధన పెట్టారు. ఇందులో తప్పేముందో అర్థం కావడం లేదు. కనీసం పదో తరగతి కూడా పాసు కాకుండా యువతీ యువకులు పెళ్లి చేసేసుకుంటే వారి జీవన గమనం ఎలా ఉండే అవకాశం ఉంటుంది? మహా అయితే కూలీ పనులకు వెళ్లి బతకగలరు తప్ప.. అత్యంత చిన్న స్థాయిలో అయినా గౌరవప్రదమైన ఉద్యోగాన్ని చదువు పొంది జీవితాన్ని కొనసాగించే అవకాశం వారికి ఉంటుందా అనేది మిలియన్ డాలర్ ప్రశ్న!.

వధూవరులు ఇద్దరూ కనీసం పదో తరగతి పాస్ అయి ఉంటే చిన్న చిన్న ఉద్యోగాలనైనా దొరకబుచ్చుకోగలరు. తర్వాత చదువు మీద ఉండే ఆసక్తిని, అవకాశాలను బట్టి నెమ్మదిగా పై చదువులని కొనసాగిస్తూ ఆయా ఉద్యోగాలలో ఉన్నత స్థానాలకు కూడా వెళ్లగలరు. 

అలాంటి అవకాశం నిండుగా ఉంటుంది. ఆ రకంగా ప్రభుత్వ సాయం అందుకొని పెళ్లి చేసుకునేంత పేద వర్గాల నుంచి వస్తున్న దంపతులు, జీవితంలో మరో రకమైన ఇబ్బందులు ఎప్పటికీ ఎదుర్కోకుండా ఉండేందుకు దూర దృష్టితో చేసిన ఏర్పాటు ఇది. పచ్చ మీడియా దీనిని కూడా చూసి ఓర్వలేక పోతోంది.

అలాగే వధూవరులు ఇద్దరి కుటుంబాలూ పేద వర్గానికే చెంది ఉండాలని కూడా ప్రభుత్వం కొత్త నిబంధనల్లో నిర్దేశిస్తోంది. వారి నెలసరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని సాయం మంజూరు చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రకమైన సంస్కరణల వలన నిజంగా అర్హులకే అన్ని రకాల సహాయాలు అందే అవకాశం ఉంటుంది.

ప్రభుత్వం సంక్షేమ పథకాల రూపేణా ప్రజలకు డబ్బులు అందిస్తే గనుక.. లెక్కాపక్కా లేకుండా కేవలం వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రం దోచిపెడుతున్నారు.. అని విమర్శలతో విరుచుకుపడతారు. అలా కాకుండా నియమ నిబంధనలను ఏర్పాటు చేస్తే, సంక్షేమ పథకాల ఫలితం పేదలకు అందకుండా అనేక కట్టుబాట్లు పెడుతున్నారు.. అంటూ వంకరగా ఆలోచిస్తారు. 

బురద చల్లడం తప్ప మరో ఎజెండా లేని పచ్చ మీడియా ఇంతకంటే భిన్నంగా ప్రవర్తిస్తుందని అనుకోవడం భ్రమ. కానీ సంస్కరణలతో కూడిన, నియమ నిబంధనలతో కూడిన పద్ధతిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తే మాత్రమే ఈ పథకాలు కలకాలం కొనసాగడానికి అవకాశం ఉంటుందని పలువురు ఆశిస్తున్నారు!