వైఎస్‌ని మించిన జ‌గ‌న్‌!

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి డాక్ట‌ర్ చ‌దివిన త‌ర్వాత ప్రాక్టీస్ పెట్టారు. రూపాయి ఫీజు. పేద‌వాళ్లు అదీ ఇచ్చేవాళ్లు కాదు. ఆయ‌న అడిగే వాళ్లు కాదు. ప‌ల్లె ప్ర‌జ‌ల క‌ష్టం తెలుసు కాబ‌ట్టి, ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో వైద్యం…

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి డాక్ట‌ర్ చ‌దివిన త‌ర్వాత ప్రాక్టీస్ పెట్టారు. రూపాయి ఫీజు. పేద‌వాళ్లు అదీ ఇచ్చేవాళ్లు కాదు. ఆయ‌న అడిగే వాళ్లు కాదు. ప‌ల్లె ప్ర‌జ‌ల క‌ష్టం తెలుసు కాబ‌ట్టి, ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో వైద్యం కోసం ఎంతో చేశారు. ఆయ‌న కొడుకు జ‌గ‌న్ తండ్రిని మించి వెళ్లారు. ఫ్యామిలీ డాక్ట‌ర్ పథ‌కం పేద‌ల‌కు వ‌రం. దాన్ని ప‌థ‌కం అన‌కూడ‌దు, సేవ అనాలి. డ‌బ్బులున్న వాళ్ల‌కి, ప‌ట్నాల్లో డాక్ట‌ర్లు అందుబాటులో ఉన్న వాళ్ల‌కి ఈ సేవ విలువ అర్థం కాదు. ప‌ల్లెల్లోని పేద‌వాళ్ల‌కి దీని విలువ తెలుసు.

ఒక‌ప్పుడు ప‌ల్లెల‌కి వైద్య‌మే తెలియ‌దు. నాటు డాక్ట‌ర్లు వుండేవారు. చిన్న‌చిన్న జ‌బ్బులైతే ఫ‌ర్వాలేదు కానీ, పెద్ద జ‌బ్బుల‌కి చికిత్స తెలియ‌క మూలిక‌లు, ప‌స‌ర్లు ఇచ్చి చంపేసేవాళ్లు. గాయాల‌కి స‌రిగా క‌ట్టు క‌ట్ట‌క సెప్టిక్ అయ్యేది. చాలా మంది త‌మ జ‌బ్బు ఏమిటో తెలియ‌కుండానే చ‌చ్చిపోయేవాళ్లు.

త‌ర్వాత ఆర్ఎంపీలు వ‌చ్చారు. వీళ్ల‌లో చ‌దువుకున్న వాళ్ల‌తో పాటు దొంగ స‌ర్టిఫికెట్లు తెచ్చుకున్న‌వాళ్లు కూడా ఉన్నారు. ఒక డాక్ట‌ర్ ద‌గ్గ‌ర కాంపౌండ‌ర్‌గా కొంత కాలం ప‌నిచేసి, డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టి వేరే రాష్ట్రం నుంచి స‌ర్టిఫికెట్ తెచ్చుకుని ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు. మ‌న స‌మాజంలో విషాదం ఏమంటే ఎవ‌రూ కూడా డాక్ట‌ర్ డిగ్రీ నిజ‌మా, కాదా అని విచారించ‌రు.

ఈ ఆర్ఎంపీలు జ్వ‌రం, జ‌లుబుకి స‌రే కానీ, అంత‌కు మించితే చేతులెత్తేస్తారు. టౌన్‌కి పంపిస్తారు. దారుణం ఏమంటే టౌన్ల‌లోని డాక్ట‌ర్లు, ఆస్ప‌త్రుల‌తో వీళ్ల‌కి లింకులు, క‌మీష‌న్లు వుంటాయి. ప్రైవేట్ ఆస్ప‌త్రులు పేద‌వాళ్ల‌ని పిండేసి, వాళ్ల‌కున్న ఎక‌రా, రెండెక‌రాల‌ను అమ్మించి కూలివాళ్ల‌గా మార్చేస్తాయి. వైద్యానికి ఖ‌ర్చు పెట్టి రోడ్డున ప‌డ్డ‌వాళ్లు ఎంద‌రో?

పీహెచ్‌సీలు వ‌చ్చిన త‌ర్వాత కూడా ప‌రిస్థితులు పెద్ద‌గా మార‌లేదు. మార్మూల ప్రాంతాల వాళ్లు మండ‌ల కేంద్రానికి వెళ్ల‌లేని స్థితి. ఈ ప‌రిస్థితుల‌న్నీ గ‌మ‌నించిన జ‌గ‌న్ ఫ్యామిలీ డాక్ట‌ర్‌ని తీసుకొచ్చారు.

వైద్యుడే స్వ‌యంగా గ్రామాల‌కు వెళ్లి రోగుల‌ని ప‌రీక్షిస్తాడు. ఎన్నో బాధ‌లు ప‌డి ఆస్ప‌త్రుల‌కు వెళ్లి క్యూలో నిల‌బ‌డి డాక్ట‌ర్ కోసం ప‌డిగాపులు కాసే రోగుల‌కి ఇది ఎంతో ఊర‌ట‌! డాక్ట‌ర్ త‌న ఇంటికే వ‌చ్చి ప‌రీక్ష చేస్తే మ‌నో ధైర్యంతోనే రోగం కోలుకుంటాడు. దీన్ని కూడా ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తే అది కేవ‌లం వాళ్ల అజ్ఞానం.

విద్య‌ని, వైద్యాన్ని పేద ప్ర‌జ‌ల‌కి దూరం చేసి జ‌నాన్ని పాప‌ర్ ప‌ట్టించిన చంద్ర‌బాబుకు ఇది అర్థం కాక‌పోవ‌చ్చు. నారాయ‌ణ అధిప‌తిని, కామినేని య‌జ‌మానిని మంత్రులుగా చేసిన ఘ‌న‌త ఆయ‌న‌ది.

విద్య‌, వైద్యం త‌మ ఇంటి ముంగిట తెస్తున్న జ‌గ‌న్‌కి పేద‌ల దీవెన వుంటుంది.