ఉత్తరాంధ్ర వేదికగా వైసీపీ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించింది. గత నెలలో భీమిలి నియోజకవర్గంలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిక్కులు పిక్కటిల్లేలా, ప్రత్యర్థుల గుండెలదిరేలా సమర శంఖాన్ని పూరించారు. ప్రత్యర్థులు పద్మ వ్యూహాన్ని రచించారని, అయితే ప్రాణాలు పోగొట్టుకోడానికి తాను అభిమన్యుడిని కాదని, అర్జునుడిని అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ శ్రేణులు శ్రీకృష్ణుడితో సమానమంటూ ఉత్సాహాన్ని నింపారు.
ఎన్నికల సమరానికి తాను సిద్ధమని, దుష్టచతుష్టయంతో తలపడేందుకు మీరు సిద్ధమా? అని తన పార్టీ శ్రేణుల్ని జగన్ గట్టిగా ప్రశ్నించడం, అటు వైపు నుంచి అంతకంటే రెట్టింపు సమరోత్సాహంతో సిద్ధం అని భరోసా ఇవ్వడం గమనార్హం. భీమిలి సిద్ధం సభతో వైసీపీలో ఉత్సాహం రెట్టింపైంది. ఈ నేపథ్యంలో రెండో సభకు ఏలూరు జిల్లా దెందులూరు వేదికైంది.
మొదటి ఎన్నికల సన్నాహక సభ కంటే మిన్నగా దెందులూరు సభను నిర్వహించేందుకు వైసీపీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు బహిరంగ సభకు వచ్చే పార్టీ శ్రేణులకు అన్ని రకాల ఏర్పాట్లు చేసేందుకు అధికార పార్టీ నాయకులు తలమునకలై ఉన్నారు. దెందలూరు సభను విజయవంతం చేసేందుకు వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ-జనసేన కూటమి పొత్తుతో వైసీపీ బలహీనంగా ఉందనే చర్చ జరుగుతోంది.
దీంతో అలాంటి చోటే వైసీపీ ఎంత బలంగా వుందో చాటి చెప్పడానికి వైసీపీ నాయకులు సర్వ శక్తులు ఒడ్డి పార్టీ శ్రేణుల్ని తరలిస్తున్నారు. మొదటి సన్నాహక సభకు వైసీపీ శ్రేణులు భారీగా తరలి చావడం, అలాగే జగన్ ప్రసంగం కూడా ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో సాగడంతో, రెండో సభ సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్షాల కళ్లన్నీ ఈ సభపైన్నే వున్నాయి.
ఉభయ గోదావరి జిల్లాలపై టీడీపీ, జనసేన కూటమి చాలా ఆశలు పెట్టుకున్నాయి. వాటిని గండి కొట్టాలని జగన్ దృఢ చిత్తంతో ఉన్నారు. దెందులూరు సభలో జగన్ ఎలా సాగుతుందో అనే ఉత్కంఠ అందరిలో వుంది. ఎందుకంటే సామాజిక సమీకరణల రీత్యా ఈ ప్రాంతం ప్రత్యేకతను సంతరించుకుంది.
జగన్ ప్రధానంగా బీసీలు, శెట్టిబలిజ, దళితులు, క్రిస్టియన్ మైనార్టీలను నమ్ముకున్నారు. వాళ్లను వైసీపీ వైపు బలంగా తిప్పుకునేందుకు ఏవైనా సంచలన ప్రకటనలు చేస్తారా? అనే భయం టీడీపీ, జనసేన నేతల్లో వుంది. ఇవాళ సాయంత్రం జరిగే బహిరంగ సభలో జగన్ ఏం మాట్లాడ్తారో విందాం.