తిరుపతి అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ప్రత్యేకత వుంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హిందూ ఆధ్మాత్మిక తిరుమల ఇక్కడే వుంటుంది. అందుకే తిరుపతికి ప్రాతినిథ్యం వహించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తిరుపతికి ప్రాధాన్యం పెరిగింది. వైసీపీ నుంచి అభ్యర్థులు ఎవరనే విషయమై స్పష్టత వచ్చింది.
తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి భూమన అభినయ్, ఎంపీగా మరోసారి డాక్టర్ మద్దిల గురుమూర్తి పోటీ చేయనున్నారు. గురుమూర్తి సిటింగ్ ఎంపీ అయినప్పటికీ, ఆయన టికెట్ విషయంలో ఇటీవల కొంత గందరగోళం ఏర్పడింది. చివరికి ఆయనకే టికెట్ దక్కింది.
ఇక టీడీపీ-జనసేన కూటమి విషయానికి వస్తే… పొత్తులో భాగంగా ఏ పార్టీకి కేటాయిస్తారో అర్థం కావడం లేదు. జనసేనను తమ పార్టీగా బలిజ సామాజిక వర్గం భావిస్తోంది. ఆ సామాజిక వర్గం ఓట్లు తిరుపతిలో కొంచెం ఎక్కువే. దీంతో తమకే కేటాయిస్తారని జనసేన నేతలు విశ్వసిస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతల ఆశల కూడా తక్కువేం లేదు. ప్రస్తుతానికి టికెట్ ఎవరికిచ్చినా అందరం కలిసి గెలిపించుకుంటామని జనసేన, టీడీపీ నేతలు ముక్త కంఠంతో చెబుతున్నారు.
మాట్లాడుకోడానికి ఇవన్నీ బాగుంటాయి. ఆచరణ వేరేలా వుంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీడీపీ నుంచి ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, వూకా విజయ్‌కుమార్, కోడూరి బాలసుబ్రమణ్యం, జేబీ శ్రీనివాస్, విద్యా సంస్థ అధినేత ప్రణీత్, నరసింహ యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. జనసేన నుంచి కిరణ్‌రాయల్, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, గేట్ విద్యాసంస్థల అధినేత వెంకటేశ్వర్లు టికెట్ రేస్‌లో ఉన్నారు.
వీళ్లంతా ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాల్ని తీవ్రతరం చేశారు. తిరుపతిలో తాను తప్ప, మరొకరు వైసీపీని దీటుగా ఎదుర్కోలేరని, కాబట్టి టికెట్ తనకే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నమ్మకంగా ఉన్నారు. ఎందుకనో ఈమె విషయంలో చంద్రబాబు, లోకేశ్ అసంతృప్తిగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. ఇక వూకా విజయ్‌కుమార్‌కు రెండు వైపులా పదును వుంది. గతంలో ఈయన ప్రజారాజ్యంలో ఉన్నారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు, అలాగే జనసేనాని పవన్ దృష్టిలో మనోడే అనే భావన ఉన్నట్టు సమాచారం. ఇదే సందర్భంలో టీడీపీ సర్వే సంస్థలతో వూకా బాగా టచ్‌లో ఉన్నట్టు వినికిడి. టికెట్ దక్కించుకోడానికి ఏం చేయాలో అన్నీ వూకా విజయ్‌కుమార్ చేస్తున్నారని సమాచారం.
మరోవైపు కోడూరి బాలసుబ్రమణ్యం బీజేపీ సీనియర్ నేత సీఎం రమేశ్ అండదండలతో టీడీపీ టికెట్ దక్కించుకునేందుకు లాబీయింగ్ వేగవంతం చేసినట్టు తెలిసింది. తన ప్రయత్నాలు, అలాగే టీడీపీ అధిష్టానం నుంచి సానుకూల స్పందనను దృష్టిలో పెట్టుకుని కోడూరి బాలసుబ్రమణ్యం తిరుపతిలో కాస్త యాక్టీవ్ అయ్యారు. తనకే టికెట్ అని సోషల్ మీడియాలో ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు.
జేబీ శ్రీనివాస్ విషయానికి వస్తే డబ్బు, రౌడీయిజం తన వద్ద ఉన్నాయని, బలమైన ప్రత్యర్థి భూమన అభినయ్‌ని ఎదుర్కొంటానని చెబుతున్నారు. విద్యా సంస్థ అధినేత ప్రణీత్ తనకు క్లీన్ ఇమేజ్ వుందని, ఒక్క అవకాశం ఇవ్వాలని టీడీపీ, జనసేన పార్టీలను అభ్యర్థిస్తున్నారు. డబ్బుకు కూడా కొదవలేదని అధినేతలను టెంప్ట్ చేస్తున్నారు. నరసింహయాదవ్ విషయానికి వస్తే… ఎప్పుడూ బలిజలకేనా, బీసీ అయిన తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నారు. అయితే ఈయనకు అవకాశాలు తక్కువే.
తిరుపతిలో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయనే సంగతి పక్కకు పోయింది. ప్రధానంగా పైరవీలే టికెట్‌ను ఫైనల్ చేస్తాయని చెప్పక తప్పదు. ఇందులో వూకా విజయ్‌కుమార్ ముందంజలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వూకా టీడీపీ నాయకుడైనప్పటికీ, జనసేన టికెట్ దక్కినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. టికెట్ సాధించడంలో తన పేరును వూకా సార్థకత చేసుకునే పనిలో ఉన్నారు.