రాయలసీమ అంటేనే కరవుకు ప్రతీక. అలాంటి రాయలసీమలో అనంతపురం జిల్లా పరిస్థితి మరీ ఘోరం. ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే అనంతపురం వాసులను కరవు రక్కసి నుంచి బయట పడేసేందుకు ముఖ్యమంత్రిగా వైఎస్సార్ గొప్ప కృషి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా పేరుగాంచిన అనంతపురం జిల్లాలో రైతులకు ప్రయోజనం కలిగేలా హంద్రీ -నీవా ప్రాజెక్టుకు మోక్షం కల్పించారు.
ఇవాళ దేశంలోనే అత్యధిక ఉద్యానవన పంటలను పండించే జిల్లాగా అనంతపురం ఎదగడానికి వైఎస్సార్ జలయజ్ఞమే కారణమని చెప్పక తప్పదు. ఉమ్మడి అనంతపురం జిల్లా రైతుల పరిస్థితిని 2004కు ముందు, ఆ తర్వాత అని మాట్లాడుకోవలసి వుంటుంది. ఎందుకంటే 2004లో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాయలసీమ వాసి అయిన వైఎస్సార్‌కు తన ప్రాంత ప్రజానీకం కష్టనష్టాలకు కరవు ప్రధాన కారణమని తెలుసు.
అందుకే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రధానంగా అనంతపురం జిల్లా విషయానికి వస్తే ఎక్కువ వ్యవసాయ భూమి అక్కడే వుంది. కానీ పంటల సాగుకు వర్షాధారం తప్ప మరో మార్గం లేదు. వర్షం కురవక, పంటలు పండకపోవడంతో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ దుర్భర పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న వైఎస్సార్… సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు.
హంద్రీ నీవా సుజల స్రవంతి పథకం కార్యరూపందాల్చడానికి వైఎస్సార్ దీక్షే కారణం. వైఎస్సార్ శ్రమ ఊరికే పోలేదు. ఉద్యానవన పంటల సాగు రూపంలో ఆయన కనిపిస్తున్న ఫీలింగ్. ఒక్క అనంతపురమే కాదు, కర్నూల్, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో నీటి వనరుల కోసం డ్యాంలు నిర్మించారు. కరవు పీడన నుంచి రైతాంగాన్ని, వ్యవసాయంపై ఆధారపడి జీవించే కూలీలు, ఇతర ప్రజానీకాన్ని బయటపడేసేందుకు ఆయన యజ్ఞం పూర్తి కాకుండానే మన మధ్య నుంచి శాశ్వతంగా దూరమయ్యారు.
ప్రజానాయకుడు వైఎస్సార్ భౌతికంగా మనకు దూరమై ఇవాళ్టితో 13 ఏళ్లైంది. కానీ ఆయన మన హృదయాల్లో నిలిచిపోయే పనులు చేశారు. అందుకే ఆయన చిరస్మరణీయుడయ్యారు.