కూట‌మిలో ద‌డ పుట్టించే లెక్క ఇదీ!

ఎన్నికలు ముగిసి రెండు రోజుల‌వుతోంది. గెలుపోట‌ముల‌పై ఎవ‌రి లెక్క‌లు వారివే. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల కంటే ఈ ద‌ఫా రెండు శాతం మేర‌కు ఓటింగ్ శాతం పెరగ‌డంపై ర‌క‌ర‌కాల విశ్లేష‌ణ‌లు. అయితే ఎవ‌రి వ‌ల్ల…

ఎన్నికలు ముగిసి రెండు రోజుల‌వుతోంది. గెలుపోట‌ముల‌పై ఎవ‌రి లెక్క‌లు వారివే. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల కంటే ఈ ద‌ఫా రెండు శాతం మేర‌కు ఓటింగ్ శాతం పెరగ‌డంపై ర‌క‌ర‌కాల విశ్లేష‌ణ‌లు. అయితే ఎవ‌రి వ‌ల్ల ఓటింగ్ శాతం పెరిగింద‌నే కీల‌క విష‌యాన్ని రాజ‌కీయ పార్టీలు విస్మ‌రించ‌డం గ‌మ‌నార్హం. 

ఈ ఎన్నిక‌ల్లో పురుషుల కంటే మ‌హిళ‌లే ఎక్కువ‌గా ఓట్లు వేయ‌డం విశేషం. ఈ ద‌ఫా 1.64 కోట్ల మంది పురుషులు, అలాగే 1.69 కోట్ల మంది మ‌హిళ‌లు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నార‌ని స‌మాచారం. మ‌గ‌వాళ్ల కంటే ఐదు ల‌క్ష‌ల మంది మ‌హిళా ఓట‌ర్లు అధికంగా ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.  మ‌హిళా ఓట‌ర్లు ఎక్కువ‌గా పాల్గొన‌డంపై వైసీపీ హ‌ర్షం వ్య‌క్తం చేస్తోంది.

మ‌హిళ‌ల్లో 57 నుంచి 60 శాతం వ‌ర‌కు వైసీపీ వైపే అని ప‌లు స‌ర్వే సంస్థ‌లు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. మ‌హిళ‌లు ఎక్కువ‌గా పాల్గొన‌డంపై కూట‌మి నేత‌లు పైకి ఎన్ని చెబుతున్నా, లోలోప‌ల భ‌య‌ప‌డుతున్నారు. త‌మ కొంప ఎక్క‌డ ముంచి వుంటారో అని కూట‌మి నేత‌లు ఆందోళ‌న చెందుతున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. వైఎస్ జ‌గ‌న్ పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 

జ‌గ‌న్‌ను వ్య‌తిరేకించాల్సిన అవ‌స‌రం వారికేంటి? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. కావున మ‌హిళ‌లు ఓటింగ్‌లో ఎక్కువ‌గా పాల్గొన‌డం తమ‌కు సానుకూల‌త‌గా అధికార పార్టీ నేత‌లు చెబుతున్నారు. చంద్ర‌బాబు వ‌స్తే సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు కావ‌నే భ‌య‌మే మ‌హిళ‌ల‌ను ఎక్కువ‌గా ఓట్లు వేయ‌డానికి ప్రేరేపించింద‌నే వాద‌న‌ను వైసీపీ ముందుకు తెస్తోంది. ఏది ఏమైనా పురుషుల కంటే  ఐదు ల‌క్ష‌ల మంది మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఓట్లు వేయ‌డం కూట‌మికి ద‌డ పుట్టించే అంశ‌మే.