ఎన్నికలైపోయాయి- ఐతే ఏంటి?

ఎన్నికలు ముగిసాయి. ప్రచార రథాల హోరు ఆగిపోయింది. నాయకులు అలసట నుంచి సేద తీరుతున్నారు. గత కొన్ని వారాలుగా పలకరించిన నాయకులు ఇప్పుడు కనిపించరు.  Advertisement పరీక్షలయ్యాక టీచర్లకి, విద్యార్థులకి ఎలాంటి గ్యాప్ వస్తుందో…

ఎన్నికలు ముగిసాయి. ప్రచార రథాల హోరు ఆగిపోయింది. నాయకులు అలసట నుంచి సేద తీరుతున్నారు. గత కొన్ని వారాలుగా పలకరించిన నాయకులు ఇప్పుడు కనిపించరు. 

పరీక్షలయ్యాక టీచర్లకి, విద్యార్థులకి ఎలాంటి గ్యాప్ వస్తుందో అలాంటి గ్యాప్ ఇది. అయితే సెలవలయ్యి స్కూళ్లు తెరుచుకోగానే టీచర్లకి విద్యార్థులకి మధ్య ఆ గ్యాప్ పోతుంది. మహా అయితే రెండు నెలల గ్యాప్ అంతే. 

కానీ ఈ నాయకులకి, ప్రజలకి మధ్యన ఈ రోజు నుంచి మొదలైన గ్యాప్ మరో ఐదేళ్లు కొనసాగుతుంది. 

మళ్లీ వాళ్లు ప్రజల వీధుల్లోకొచ్చేది, రోడ్లూడ్చేది, డ్యాన్సులేసేది, దండాలు పెట్టేది, ముద్దులు పెట్టేది ఐదేళ్ల తర్వాతే. 

మరి ఆ ఐదేళ్లు వాళ్లేం చేస్తారు?

ఈ ప్రశ్నకి సమాధానం చెప్పుకునే ముందు తెలుసుకోవాల్సింది ఒకటుంది. 

ఈ ఎన్నికల్లో ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి రూ 30 కోట్ల నుంచి రూ 150 కోట్ల వరకు ఖర్చు పెట్టాడు. మంది మార్బలాన్ని పోషించడానికి, వాహనాల్లో ఇంధనానికి, ఫ్లెక్సీలకి, ప్రచార సామగ్రీకి పెట్టిన ఖర్చుతో పాటు ఓటర్లకి పంచిన లెక్క కూడా ఇందులో ఉంది. 

మరి ఆ ఖర్చుని రాబట్టుకోవడం ఎలా? 

ఈ ప్రశ్నకి చాలా మంది సమాధానం చెప్పడానికి రెడీ అయిపోతారు కానీ అసలు ముందు ఖర్చు చేయడానికి అంత డబ్బు వాళ్లకి ఎక్కడనుంచి వచ్చింది అనేది ఆలోచించరు.  

సొంత డబ్బుని బయటికి తీసి ఖర్చు పెట్టుకునే అభ్యర్థులు తక్కువ. వేల కోట్ల ఆస్తులున్నవాళ్లు తప్ప తక్కిన వాళ్లంతా విరాళాల రూపంలోనే సేకరిస్తారు. 

తమ నియోజకవర్గ పరిథిలో ఉన్న పెద్ద పారిశ్రామికవేత్తలో, వ్యాపారులో తలో చెయ్యి వేయడం సహజం. ఏ పార్టీ పదవిలోకొస్తుందో తెలీదు కనుక స్థానిక నాయకుడితో సంబంధాలు బాగుండాలని ముందుగానే ఎంతో కొంత ఇవ్వచూపుతారు, ఇస్తారు. ఆ రకంగా పోగైన సొమ్మే ఎక్కువగా ఎన్నికలకి వాడుతుంటారు. 

ఎలక్షన్ కమీషన్ నిబంధన ప్రకారం ఎంపీ అభ్యర్థి 95 లక్షలకి, ఎమ్మెల్యే అభ్యర్థి 40 లక్షలకి మించి ఖర్చు చేయకూడదు. అయితే ఆ సొమ్ముతో ఏ పనీ జరగదని అందరికీ తెలుసు. అందుకే ఎన్నికల వేళ లెక్కంతా క్యాష్ రూపంలోనే చలామణీ అవుతుంది. ఎక్కడ లేని బ్లాక్ మనీ బయటికొస్తుంది. 

అలాగే అభ్యర్థి అకౌంట్లోంచి కాకుండా అతని తరపున ఖర్చు పెట్టే ధనికస్వాములైన అభిమానులు కూడా ఉంటారు. వీరిలో ఇలా విరాళాలు ఇచ్చినవాళ్లల్లో చాలామంది తిరిగి ఆ నాయకుడి నుంచి ఏదో పొందాలని ఆశించి ఇవ్వరు. మరెందుకిస్తారు అంటే… కనీసం ఇబ్బందులు పెట్టకుండా ఉంటాడని!!! 

కనుక ఖర్చు పెట్టిన మొత్తాన్ని వెనక్కి సంపాదించాల్సిన టెన్షన్ అందరు ఎమ్మెల్యేలకి ఉండదు. ఫండ్స్ పూలింగ్ తెలియకో, పూలైన ఫండ్ సరిపోకో సొంత స్థలాలో ఆస్తులో అమ్మి ఎన్నికల్లో ఖర్చు పెట్టిన వాళ్లకి రికవర్ చేసుకునే ప్రెజర్ ఉంటుంది. అయితే రికవరీతో సంబంధం లేకుండా గెలిచిన ప్రతి ఎమ్మెల్యేకి డబ్బు అవసరముంటుంది. ఎమ్మెల్యేగా అందుకునే జీతంతో రాజకీయం నడపాలంటే కష్టం. అంతటి టంగుటూరి ప్రకాశం పంతులు స్థాయి నాయకులు ఇప్పుడు లేరు కనుక ఆ కేటగిరీ గురించి అసలిక్కడ ప్రస్తావించడం అనవసరం. 

ఈ రోజుల్లో గెలిచిన ఏ అభ్యర్థికైనా డబ్బు సంపాదించుకోవాలని ఉంటుంది. తోటి ఎమ్మెల్యేలు ఎలా వెనకేస్తున్నారో చూస్తూ ఆ స్థాయిని అందుకోవాలని ఉంటుంది. మరి సంపాదించడం ఎలా? 

గతంలో సాండ్ కాంట్రాక్టులుండేవి. మద్యం వ్యాపారులుండేవి. మైనింగ్ ఉండేది. రోడ్లు వేయడం వగైరా సివిల్ కాంట్రాక్టులుండేవి. ఇలా ఏదో రకంగా ఎమ్మెల్యేలు దండిగా కోట్లు సంపాదించుకునేవారు. 

కానీ జగన్ మోహన్ రెడ్డి పాలనలో గత ఐదేళ్లుగా పైన చెప్పుకున్నవన్నీ ప్రభుత్వపరం అయి కూర్చున్నాయి. వీటిల్లో వెళ్లు పెట్టడానికి గెలిచిన ఎమ్మెల్యేలకి కుదరలేదు. సివిల్ కాంట్రాక్టులు కూడా కార్పోరేట్‌ కంపెనీలకి పోతున్నాయి. 

గతంలోనూ, గత ఐదేళ్లుగానూ ఉన్న ఒక లొసుగు ఏమిటంటే భూములు. ప్రభుత్వ భూముల్ని సొంతం చేసుకోవడమనే అవకాశాన్ని మాత్రం ఎమ్మెల్యేలు, ఎంపీలు వాడుకుంటూ వస్తున్నారు అక్కడక్కడ. అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ఇక శాశ్వతంగా అన్ని రకాల కబ్జాలను ఆపే ప్రయత్నం జరుగుతోంది. అది వేరే సంగతి. 

ఇక ఎమ్మెల్యేలకి సంపాదించుకోవడానికి మిగిలిన మార్గాలు రెండు. ఆల్రెడీ ఆ పనులు చేస్తున్నారు కూడా.

1. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో జరిగే ప్రతి ఆస్తి లావాదేవీలోనూ కొంత శాతం కమీషన్.

2. పోలీసు కేసుల్లో ఔట్ సైడ్ కోర్ట్ సెటిల్మెంట్స్ లో వచ్చే దాంట్లో వాటా.

అంతే కాదు. కొన్ని ప్రాంతాల్లో 10 ఎకరాల ల్యాండ్ కొనాలని ఏ వ్యాపారైనా వెళ్తే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ పర్మిషన్ కావాలంటున్నారు అధికారులు. అంటే ఆ ల్యాండ్ వేల్యూలో కొంత శాతం ముడుపులివ్వాలన్నమాట. లేకపోతే పని ముందుకు నడవదు. ఇదీ పరిస్థితి. 

అయితే ఈ తరహా లంచాలు ప్రజలకి నొప్పి తెలీకుండా తీసుకుంటున్నారని వినికిడి. ఉదాహరణకి కోటి రూపాయల ప్రోపర్టీ అమ్మినప్పుడు పదివేల రూపాయల కమీషన్ అన్నమాట. లంచం ఎంత ఇచ్చినా లంచమే. ఎంత తీసుకున్నా తప్పే. అయితే మరీ రక్తం పిండినట్టు వసూలు చేయకుండా ఒక చిన్న మొత్తాన్ని తీసుకుంటూ కొద్ది కొద్దిగా వెనకేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆ మధ్యన చంద్రబాబు అరెస్ట్‌ విషయంలో “యాక్సెప్టెబుల్ లెవెల్ ఆఫ్ కరప్షన్” చట్టం తీసుకురావాలని డిమాండ్ చేసారు. అంటే కొంత మొత్తం వరకు లంచం తీసుకున్నా అది నేరం కింద పరిగణించకూడదని ఆయన సలహా. ఇది అలాంటిదే అనుకోవచ్చు. 

ఒకవేళ భవిష్యత్తులో ల్యాండ్ రిజిష్ట్రేషన్ కేంద్రప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోతే ఇక స్థానిక నాయకులకి ఈ అవకాశం కూడా ఉండదు. రానున్న రోజుల్లో ఈ ప్రక్రియను కూడా ప్రవేశపెట్టాలని కేంద్రస్థాయిలో డిస్కషన్స్ అవుతున్నాయని ఏడాది క్రితం వినిపించింది. 

ఇదంతా పక్కనపెడితే.. ప్రస్తుతం ఏ ఓటరుకైనా ఏ ల్యాండ్ సమస్యో వస్తే స్థానిక ఎమ్మెల్యే వద్దకు వెళ్లమని అధికారులు చెప్తారు. ఆ ఎమ్మెల్యే సెటిల్మెంట్ చేసి కమీషన్ అడుగుతాడు. ఇదెక్కడి అన్యాయం అని అరిస్తే న్యాయం కాదు. ఎందుకంటే అభ్యర్థుల ఆఫీసుల వద్ద తమకి ఓటుకింతని డబ్బు అందలేదని గొడవచేసిన ఓటర్లున్నారు. ఓటుకి డబ్బుని ఒక్క రోజు లంచంగా తీసుకున్నందనుకు ఐదేళ్ల పాటు ఆ గెలిచిన వ్యక్తికి కమీషన్లు గుంజే నైతిక హక్కుని ఇచ్చినట్టే. 

81% ఓటింగ్ నమోదయ్యిందంటే హైదరాబాదు నుంచి, ఇతర ప్రాంతాల నుంచి బస్సుల్లోను, రైళ్లలోనూ వచ్చిన ఓటర్లు ఎందరో. దానికి ముఖ్య కారణం కులాభిమానం, రాజకీయ చైతన్యం, సరదా, బాధ్యతలతో పాటు ఆంధ్రలో వెల్లువలా పంచిన డబ్బు కూడా. అందరూ కాదు కానీ అధికసంఖ్యాకులు ఓటుకోసం ఇస్తున్న డబ్బు కోసం రెండ్రోజుల ముందు నుంచే వారి ప్రాంతాలకు చేరుకున్నారు. డబ్బు తీసుకున్నారు. ఓట్లేసారు. గెలిచాక డబ్బు గుంజవచ్చనే ధైర్యాన్ని ఆ అభ్యర్థులకి ఇచ్చి వచ్చారు. 

– శ్రీనివాసమూర్తి