విహారానికి వెళ్లొద్దాం!

ఎన్నిక‌లు ముగియ‌డంతో రాజ‌కీయ నాయ‌కులు కాస్త రిలాక్ష్ అవుదామ‌నుకుంటున్నారు. నాయ‌కులే కాదు, వారి అనుచ‌రులు, రాజ‌కీయాల్లో మునిగితేలే వారంతా రొటీన్ జీవితం నుంచి కొన్ని రోజులైనా …వెన్నెల్లో హాయ్ హాయ్ అన్న‌ట్టుగా భిన్నంగా గ‌డిపేందుకు…

ఎన్నిక‌లు ముగియ‌డంతో రాజ‌కీయ నాయ‌కులు కాస్త రిలాక్ష్ అవుదామ‌నుకుంటున్నారు. నాయ‌కులే కాదు, వారి అనుచ‌రులు, రాజ‌కీయాల్లో మునిగితేలే వారంతా రొటీన్ జీవితం నుంచి కొన్ని రోజులైనా …వెన్నెల్లో హాయ్ హాయ్ అన్న‌ట్టుగా భిన్నంగా గ‌డిపేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

కౌంటింగ్‌కు ఇంకా 20 రోజులు గ‌డువు ఉండ‌డం, అలాగే వేస‌వి కావ‌డంతో కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌తో క‌లిసి చాలా మంది నాయ‌కులు ఇప్ప‌టికే టూర్ల‌కు వెళ్లారు. మ‌రికొంద‌రు ఆ ప్లానింగ్‌లో ఉన్నారు. ఎన్నిక‌ల్లో త‌ల‌మున‌క‌లై ఇంత‌కాలం ఘాటు విమ‌ర్శ‌లు, ప‌ర‌స్ప‌ర దూష‌ణ‌ల‌తో నాయ‌కులు గ‌డిపారు. స్థాయిని బ‌ట్టి చిన్నాపెద్దా అనే తేడా లేకుండా నాయ‌కులంతా ప‌ర‌స్ప‌రం విమ‌ర్శించుకున్నారు.

రాజ‌కీయాలు, ఎన్నిక‌ల ఒత్తిళ్ల నుంచి బ‌య‌ట‌ప‌డాల‌నే విష‌యంలో అన్ని పార్టీల నాయ‌కుల అభిప్రాయం ఒక‌టే. అయితే ఆ స‌మ‌యం కోసం అంద‌రూ ఎదురు చూస్తున్నారు. ఆ స‌మ‌యం రానే వ‌చ్చింది. 13న ఎన్నిక‌లు పూర్తి కావ‌డంతో, చాలా మంది నాయ‌కులు సెల్‌ఫోన్లు ఆఫ్ చేసి, త‌మ‌కిష్ట‌మైన ప్రాంతాల‌కు వెళ్లారు. మ‌రికొంద‌రు రాజ‌కీయాల‌తో విసిగి పోయి, సెల్‌ఫోన్ల‌కు కూడా అందుబాటులో వుండ‌కుండా, క‌నీసం త‌మ ఆచూకీ కూడా ఎవ‌రికీ తెలియ‌కుండా కుటుంబ స‌భ్యుల‌తో వెళ్లారు. 

ఏపీ రాజ‌కీయాలు మిగిలిన ప్రాంతాల‌తో పోలిస్తే, ఎక్కువ క‌లుషితం అయ్యాయి. విమ‌ర్శ‌ల ప‌రిధి దాటి తిట్ల వ‌ర‌కూ వెళ్లింది. ఇందులో ఒక‌రికి మించి మ‌రొక‌రు ఉన్నారు. వీళ్ల వైఖ‌ర్ల‌తో జ‌నం విసుగు చెందారు. రాజ‌కీయాలంటేనే అస‌హ్యించుకునే ప‌రిస్థితి. అందుకే రాజ‌కీయాలంటే… వ‌ద్దు బాబోయ్ అని త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. మ‌న‌సుకు కాస్త ఆహ్లాదం క‌లిగించే అంశాల‌పైనే దృష్టి సారించారు.