గెలుపే ప్రామాణికంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికకు శ్రీకారం చుట్టారు. ఇందులో వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు చాలా తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. సర్వే నివేదికలను ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు సిటింగ్ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను మార్చేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.
కర్నూలు వైసీపీ సమన్వయకర్తగా డాక్టర్ ఇలియాస్ బాషాను దాదాపు ఖరారు చేశారు. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి. కర్నూలులో మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఎమ్మెల్యేకు ఎస్వీ సహకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. దీంతో హఫీజ్‌ఖాన్‌ను మార్చి, కొత్త అభ్యర్థిగా తీసుకురావడం ద్వారా వైసీపీ శ్రేణుల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కర్నూలు వరకూ ఓకే.
కర్నూలు సిటింగ్ ఎమ్మెల్యేను మార్చేందుకు నిర్ణయించారని తెలిసి, కడప వైసీపీ శ్రేణులు కూడా జగన్‌కు ఓ విజ్ఞప్తి చేస్తున్నాయి. కడప సిటింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం అంజాద్‌బాషాను కూడా మార్చి వైసీపీని కాపాడేందుకు రోంత ఆలోచించు బ్బి అని ఆ పార్టీ సీనియర్ నేతలు కోరుకుంటున్నారు. అంజాద్‌బాషా, ఆయన కుటుంబ సభ్యుల ఆగడాలు పెరిగాయని, సొంత పార్టీ శ్రేణులు కూడా భరించలేనంతగా ఉన్నాయని సీఎం జగన్‌కు విన్నవించుకోవడం గమనార్హం.
అంజాద్ బాషా, ఆయన సోదరుడి అహంకారపూరిత చర్యల వల్ల కడపలో కొందరి మనోభావాలు దెబ్బ తింటున్నాయి. ఇప్పటికే అంజాద్‌బాషా రెండుసార్లు కడప నుంచి ఎన్నిక కావడం, జగన్ కేబినెట్లో ఏకంగా డిప్యూటీ సీఎం హోదా దక్కించుకోవడంతో, తమ అధికారాన్ని జనంపై దాదాగిరి చేయడానికి ప్రయోగిస్తున్నారనే బలమైన ఆరోపణ వుంది.
కడపలో డిప్యూటీ సీఎం కుటుంబ అరాచకాలతో పోల్చితే కర్నూలు సిటింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత చాలా తక్కువనే అభిప్రాయం వుంది. అంజాద్‌బాషాను తప్పించి మరో మైనార్టీ నాయకుడికి ఇస్తే బాగుంటుందని సీఎం జగన్‌కు వైసీపీ శ్రేణులు విన్నవించుకుంటున్నాయి.