మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భార్య నారా భువనేశ్వరి ఇప్పుడు ఊరూరా తిరిగి చనిపోయిన తెలుగుదేశం కార్యకర్తల కుటుంబాలకు చెక్కులు అందజేసి, వారిని ఊరడించే పర్యటనలు చేస్తున్నారు. ఈ ఊరడింపు యాత్రకు ‘నిజం గెలవవాలి’ అనే పేరెందుకు పెట్టారో వారికే తెలియాలి.
చంద్రబాబునాయుడును అరెస్టు చేయడంతోనే.. తెలుగుదేశం కార్యకర్తలు గుండెపగిలి చనిపోయారని.. అలాంటి కుటుంబాలకు అండగా నిలబడడమే తమ లక్ష్యమని అంటున్నారు. అయితే ఈ యాత్రకు స్ఫూర్తి మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా నారా భువనేశ్వరి ఒప్పుకుంటున్నట్టే కనిపిస్తోంది.
ఈ విషయం ఆమె నేరుగా వెల్లడించకపోయినప్పటికీ.. ఆమె తన యాత్ర రూపుదిద్దుకున్న తీరును వెల్లడించడం గమనిస్తే.. ఆమె అచ్చంగా జగన్ బాటలోనే, ఆయన స్ఫూర్తితోనే ఈ పనిచేస్తున్నట్టుగా అర్థం వచ్చేలా ఆమె మాటలున్నాయి.
చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఇళ్లకు వెళ్లి పరామర్శించాలని భువనేశ్వరి అనుకున్నారట. అయితే ఇంటింటికీ ఎలా తిరుగుతావంటూ ఆమె స్నేహితులు, కుటుంబసభ్యులు వారించారట. అందరినీ ఒక చోటకు పిలిచి చెక్కులు ఇస్తే సరిపోతుందని సలహా ఇచ్చారట. అయినా ఆమె మనసు ఒప్పుకోలేదట. ‘నా బిడ్డలైన కార్యకర్తల కుటుంబాలు బాధలో ఉన్నప్పుడు నేనే నేరుగా వెళ్లి ధైర్యం చెప్పాలనుకున్నాను’ అంటూ భువవనేశ్వరి తన యాత్రకు వివరణ ఇచ్చుకున్నారు.
అయితే చూడబోతే.. ‘ఇలా కార్యకర్తల ఇళ్లకే వెళ్లి సాయం అందించి భరోసా ఇవ్వడానికి నాకు జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తి’ అనే మాట చెప్పడం ఆమె మరచిపోయినట్టున్నారు. ఆమె ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. అది నిజమే అని ప్రజలకు తెలుసు.
ఎందుకంటే.. జననేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు.. మరణించిన వారి ఇళ్లకు స్వయంగా వెళ్లి భరోసా ఇవ్వాలని సంకల్పించినది ఆయనే. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన ఆలోచనకు అడ్డుపడింది. అందరినీ ఒకచోటకు పిలిచి సాయం అందిస్తే సరిపోతుందని చెప్పింది. జగన్ వారి మాట ఖాతరు చేయకుండా, పార్టీనుంచి బయటకు వచ్చి మరీ.. తాను అనుకున్నట్టుగా ఓదార్పు యాత్ర చేపట్టి అన్ని కుటుంబాలను పరామర్శించారు.
ఇప్పుడు నారా భువనేశ్వరి కూడా అదే జగన్ బాటలోనే ఇంట్లో వాళ్లు వద్దన్నప్పటికీ.. ఇల్లిల్లూ తిరుగుతున్నానని చెప్పారు. అయితే ఈ యాత్రకు నిజం గెలవాలి అంటూ ఒక మాయ పేరు ఎందుకు పెట్టారో తెలియదు. అలాగే.. ఆమె ఇల్లిల్లూ తిరుగుతానంటే వద్దని చెప్పిన కుటుంబసభ్యుల పేర్లు కూడా ఆమె వెల్లడిస్తే బాగుంటుంది. ప్రజలు వారి గురించి ఒక ఒపీనియన్ కు రావడం కుదురుతుంది.