వాలంటీర్లతోనే దెబ్బతిన్నాం

వాలంటీర్లు అంటే జగన్ కి ఎంతో ఇష్టమైన వారు. వాలంటీర్లకు ఆయన సేవా పురస్కారాలు కూడా ప్రదానం ఏటా చేస్తూ వారిని బాగా దగ్గరకు తీసుకున్నారు. ఎన్నికల్లో పార్టీ గెలుపునకు వారే కర్త కర్మ…

వాలంటీర్లు అంటే జగన్ కి ఎంతో ఇష్టమైన వారు. వాలంటీర్లకు ఆయన సేవా పురస్కారాలు కూడా ప్రదానం ఏటా చేస్తూ వారిని బాగా దగ్గరకు తీసుకున్నారు. ఎన్నికల్లో పార్టీ గెలుపునకు వారే కర్త కర్మ క్రియ అవుతారని కూడా వైసీపీ హై కమాండ్ భావించింది.

అయితే అదే వాలంటీర్లు పార్టీ ఓటమికి కారకులు అయ్యారు అని వైసీపీ నేతలు తమ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేల్చారు. విశాఖ ఉత్తరం నుంచి ఈసారి తప్పకుండా ఎమ్మెల్యే అవుతాను అని ఆశించిన వైసీపీ అభ్యర్ధి కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్ల మీద సంచలన వ్యాఖ్యలే చేశారు.

వాలంటీర్ల వల్ల ప్రతీ కుటుంబానికి మేలు జరిగింది. వారు పౌర సేవలను నేరుగా ఇంటికే వచ్చి అందించారు. అలా పాలన ప్రజల గుమ్మం వద్దకు వెళ్ళింది పధకాలు అన్నీ వెళ్ళాయి. కానీ దారుణంగా రాజకీయంగా నష్టపోయింది మాత్రమే వైసీపీయే అని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇది తాను ఓపెన్ గానే చెబుతున్నాను అని అన్నారు.

వాలంటీర్ల వల్ల పార్టీకి నాయకులకు క్యాడర్ కి ప్రజలతో నేరుగా సంబంధాలు తెగిపోయాయని ఆయన చెప్పారు. వాలంటీర్లతో అన్ని పనులూ అయిపోవడం వల్ల జనాలకు నాయకుడి అవసరమే లేకుండా పోయిందని అన్నారు.

ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చేది ప్రజలకు సేవ చేయాలని మంచి పేరు తెచ్చుకోవాలని అని కేకే రాజు అన్నారు. అయితే వాలంటీర్ల కారణంగా ప్రజలకు సేవ చేసే అవకాశమే లేకుండా పోయిందని అన్నారు. సరిగ్గా ఎన్నికల సంఘం వాలంటీర్ల సేవలు వద్దు అని పక్కన పెట్టిన తరువాత పధకాల లబ్దిదారులది ఒక దారి వైసీపీ నేతలది ఒక దారీ అయిపోయింది అన్నారు.

తాము పధకాలు అందించామని మంచి చేశామని లబ్దిదారులకు చెబుదామన్నా వారిని వెతుక్కోవాల్సి వచ్చిందని, అప్పటికే పుణ్య కాలం పూర్తి అయిపోయిందని కేకే రాజు చెప్పారు. ఇది ఆయన ఒక్కరి బాధ కాదు మొత్తం పార్టీ బాధగానే చూడాలని అంటున్నారు. వాలంటీర్ల వ్యవస్థ వల్ల పార్టీని నిలువునా దెబ్బ తీసుకోవడం వల్లనే ఈరోజు ఈ దుస్థితి వచ్చిందని పార్టీ నేతలు అంటున్నారు.