రుషికొండ బోడి గుండు అంటూ విశాఖలో టీడీపీ జనసేన ఇతర విపక్షాలు చేసిన ప్రచారంతో వైసీపీకి కొంప మునిగింది. తాజా ఎన్నికల ఫలితాలలో గుండు సున్నాయే వచ్చింది. రుషికొండను నున్నగా చేశారని అక్కడ ఏవో రహస్య మందిరాలు నిర్మిస్తున్నారు అని తోచిన తీరున వ్యాఖ్యాలతో నేతలు ఆరోపిస్తూంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వార్తలు చాలా రాసింది.
ఇంతకీ రుషికొండ పైన నిర్మాణాలు ఏమిటి అసలు ఏమి జరుగుతోంది అన్నది సీపీఐ నేత నారాయణ చూసి వచ్చారు. అక్కడ భవనాలే నిర్మిస్తున్నారు అని ఆయన స్పష్టం చేశారు. అయినా రుషికొండ మీద చర్చ ఎక్కడా ఆగింది కాదు.
వైసీపీ వారి మాట ప్రకారం చూస్తే రుషికొండ వద్ద ఆధునాతన భవనాలు నిర్మించామని అది టూరిజం డెవలప్మెంట్ కోసమని పేర్కొన్నారు. రుషికొండ విషయంలో ఇలా రాజకీయం చాలా నడచింది. ఎన్నికల ప్రచారం కోసం విశాఖ వచ్చిన లోకేష్ టీడీపీ అధికారంలోకి వస్తే రుషికొండను ప్రజా భవన్ గా మారుస్తామని అన్నారు.
భీమిలీ నియోజకవర్గం పరిధిలో ఉన్న రుషికొండ విషయంలో కొత్తగా గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రుషికొండ కాటేజీల వివాదం మీద చంద్రబాబుతో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
రుషికొండ మీద అత్యాధునికంగా నిర్మించిన భవనాలను ఏమి చేయాలన్న దాని మీద టీడీపీ ఆలోచన చేస్తోంది. వైసీపీ గెలిస్తే అది సీఎం క్యాంప్ ఆఫీసు అయ్యేది, ఇపుడు రాజ ప్రసాదంగా ఉన్న ఈ భవనాలను టీడీపీ ఏ విధంగా వాడుకుంటుంది అన్నది ఆసక్తిని కలిగిస్తున్న విషయం. ఆ భవనాలను చూడాలని టీడీపీతో పాటు విశాఖ వాసులు కూడా సరదా పడుతున్నారు.