కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక ఖరారైంది. కిర్లంపూడిలో ఆయన నివాసానికి ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఇవాళ వెళ్లనున్నారు. ఆయనతో పాటు ఆ ప్రాంత వైసీపీ ముఖ్య నేతలు కూడా వెళ్లి ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇప్పటికే ముద్రగడతో వైసీపీ నాయకులు చర్చించారు.
ఇప్పుడు ముద్రగడ ఇంటికి వైసీపీ ముఖ్య నేతలు వెళ్లి ఆహ్వానించడం కేవలం లాంచనమే. అసలు తన ఇంటి వద్దకే వైసీపీ నేతలు రావద్దని చెప్పిన ముద్రగడ, తాజాగా వారిని ఆహ్వానించడం కీలక పరిణామంగా చెప్పొచ్చు. జనసేనాని పవన్‌కల్యాణ్ తనను అవమానించారనే ఆవేదనతోనే ఆయన వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు.
తన సామాజిక వర్గానికి చెందిన పవన్‌కల్యాణ్‌ను రాజకీయంగా ఉన్నతంగా చూడాలని ముద్రగడ అనుకున్నారు. అందుకే ఆయనతో విభేదాలను సైతం పక్కన పెట్టి కలిసి పని చేసేందుకు జనసేనలో చేరడానికి సిద్ధమయ్యారు. పవనే స్వయంగా కిర్లంపూడి వెళ్లి ముద్రగడను పార్టీలో చేర్చుకుంటారని జనసేన నేతలు బహిరంగంగా ప్రకటించారు. చివరికి ముద్రగడ దగ్గరికి వెళ్లేందుకు పవన్‌కు సమయం దొరకలేదు. దీన్ని బట్టి తనపై పవన్‌కు ఏ పాటి గౌరవం వుందో ముద్రగడకు అర్థమైంది.
తన ఆవేదనను బహిరంగ లేఖ ద్వారా ఇటీవల ముద్రగడ వెల్లడించారు. ఔన్లే తన దగ్గరికి రావాలంటే…ఎవరెవరి అనుమతో పొందాల్సి వుంటుందని లేఖలో పవన్ తనదైన వెటకారంతో చెప్పారు. దీంతో జనసేనలో ముద్రగడ చేరరనే ప్రచారం జరిగింది. ఇదే సందర్భంలో ముద్రగడతో వైసీపీ టచ్‌లోకి వెళ్లింది. పవన్‌పై రగిలిపోతున్న ముద్రగడను చేర్చుకోవడం ద్వారా ఎంతోకొంత రాజకీయ ప్రయోజనం వుంటుందని వైసీపీ భావన.