ఏపీలో అరశాతం ఓటు బ్యాంక్ ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకోడానికి చంద్రబాబునాయుడు వెంపర్లాడుతున్నారు. తనను తాను తగ్గించుకుని బీజేపీతో సయోధ్య కోసం చంద్రబాబు ఆరాటపడడం టీడీపీ శ్రేణులకు కూడా నచ్చడం లేదు.
బీజేపీకి బాబును దగ్గర చేయడానికి పవన్ తన వంతు కృషి చేస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే… బీజేపీని వైఖరిని ఇటు టీడీపీ, అటు జనసేన శ్రేణులు తప్పు పడుతున్నాయి. అయినప్పటికీ అధినాయకులు మాత్రం తమ పార్టీ నాయకులు, కార్యకర్తల మనో భావాలను పరిగణలోకి తీసుకోకుండా ఆ పార్టీతో కలిసి ముందుకెళ్లడానికి ఉత్సాహం చూపుతున్నారు.
ఇవాళ పొత్తు విషయమై స్పష్టత కోసం చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారు. ఏ రకంగా చూసినా బీజేపీతో పొత్తు ఆ రెండు పార్టీలకు రాజకీయంగా నష్టమే. అయినా బీజేపీ పొత్తు కోసం మరీ ముఖ్యంగా చంద్రబాబునాయుడు ఎందుకంతగా వెంపర్లాడుతున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీని వెనుక బలమైన కారణాలున్నాయని చెబుతున్నారు.
చంద్రబాబునాయుడికి అధికారంలోకి రావడం కంటే, తనను తాను జగన్ నుంచి రక్షించుకోవడం మొదటి ప్రాధాన్యంగా చెబుతున్నారు. అలాగే తనను నమ్ముకున్న వాళ్లకు జగన్ నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా రక్షణ కవచంగా బీజేపీ వుంటుందనే నమ్మకంతోనే ఆ పార్టీ నీడన చేరేందుకు బాబు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే చర్చకు తెరలేచింది.
ఇప్పటికే చంద్రబాబుపై వరుస కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు జైలుకెళ్లి, 50 రోజులకు పైగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. వైఎస్ జగన్ పని అయిపోయిందని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ రంకెలేస్తున్నప్పటికీ, వాళ్లిద్దరి మనసుల్లో ఏదో భయం, అనుమానం. జగన్ మళ్లీ వస్తే రాజకీయంగా తమ ఉనికికే ప్రమాదమని పవన్, చంద్రబాబు వణికిపోతున్నారు.
కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందనే సంకేతాలు వెలువడుతుండడంతో, ఆ పార్టీ నీడలో వుంటే తాము సురక్షితంగా వుండొచ్చనేది పవన్, చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. అప్పుడు రాష్ట్రంలో ఫలితాలు ఎలా వున్నా, కేంద్ర ప్రభుత్వ అండ ఉందనే భరోసాతో బతికేయొచ్చనేది చంద్రబాబు ఆలోచన. లేదంటే కేసుల్లో తనను మరోసారి జైలుకు పంపుతారని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే బీజేపీపై ఏపీ ప్రజానీకం రగిలిపోతోంది. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని మండిపడుతున్నారు.
అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకునే టీడీపీపై కూడా ఆ నెగిటివిటీ తప్పక పడుతుంది. అయినప్పటికీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడానికి చంద్రబాబు రెడీ కావడం గమనార్హం. గతంలో లోకకల్యాణం కోసం ఎన్‌డీఏ నుంచి బయటికొచ్చి, మోదీని మరోసారి ప్రధాని కానివ్వనని చంద్రబాబు శపథం చేశారు. ఈ దఫా బీజేపీతో అంటకాగడానికి ఎలాంటి నీతి సూక్తులు చెబుతారో చూడాలి.