తాడేపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని ప్రభుత్వం కూల్చివేస్తోంది. ఈ మేరకు భారీ పోలీసు బందోబస్తు మధ్య ఐదు ప్రొక్లైనర్లతో కూల్చివేత చర్యలు చేపట్టడం గమనార్హం. తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత నోటీసులపై ఇప్పటికే ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. చట్టనిబంధనలను ఉల్లంఘించి కార్యాలయ నిర్మాణాల్ని కూల్చివేయొద్దని ఆదేశాలు ఇచ్చినట్టు వైసీపీ చెబుతోంది. అయితే ఇవాళ తెల్లవారుజామునే సీఆర్‌డీఏ అధికారుల ఆదేశాల నిర్మాణంలో ఉన్న కార్యాలయ తొలగింపునకు ప్రభుత్వం ఉత్సాహం ప్రదర్శించింది.
ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వైసీపీపై కక్ష పూరిత చర్యలకు దిగడంపై ఆ పార్టీ మండిపడుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి వైఎస్సార్ విగ్రహాలు తొలగింపు, వాటిని పగలగొట్టడం, అలాగే కార్యకర్తలు, నాయకులపై, వ్యక్తిగత ఆస్తులపై దాడులకు టీడీపీ పాల్పడుతోందని వైసీపీ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయ విధ్వంసానికి ప్రభుత్వం తెగబడిందని, పూర్తిగా నేలమట్టం చేస్తోందని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైకోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా ప్రభుత్వం దుందుడుకు చర్యలకు పాల్పడినట్టు వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తామిచ్చిన హామీలను అమలు చేయడంపై కాకుండా, ప్రతిపక్ష పార్టీపై కక్ష తీర్చుకోడానికి ఎక్కువ శ్రద్ధ చూపుతుందనేందుకు ఆ పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని నేలమట్టం చేయడమే నిదర్శనం అని వారు విమర్శించడం చర్చనీయాంశమైంది.