వైసీపీ తరపున నలుగురు నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా తమ ఆస్తులు, అప్పులు, కేసులు తదితర వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించారు. నలుగురిలో ఇద్దరు తమ పార్టీ వాళ్లే అని టీడీపీ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.
నెల్లూరుకు చెందిన బీద మస్తాన్‌రావు, అలాగే తెలంగాణ నివాసి, బీసీ సంఘం జాతీయ నాయకుడు ఆర్.కృష్ణయ్యను తమ పార్టీ ఖాతాలో టీడీపీ వేసుకుంది.
బీద మస్తాన్‌రావు ఇంటిపేరులో తప్ప సంపాదనలో ధనికుడే. రాజ్యసభకు నామినేషన్ వేసిన నలుగురిలో అత్యంత సంపన్నుడు బీద మస్తాన్‌రావే కావడం గమనార్హం. ఇదే సందర్భంలో తక్కువ ఆస్తులున్న నాయకుడు ఆర్.కృష్ణయ్య కావడం విశేషం.
బీద మస్తాన్‌రావు కుటుంబ మొత్తం ఆస్తి రూ.243 కోట్లు. ఇది అధికారిక లెక్క. ఇక అనధికారికంగా ఏ రేంజ్‌లో వుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇదే సందర్భంలో రూ.85 కోట్ల అప్పులు కూడా ఆయన చూపించారు. సుదీర్ఘకాలం పాటు టీడీపీలో బీద మస్తాన్‌రావు కొనసాగిన సంగతి తెలసిందే. గత 2019 ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ నుంచి టీడీపీ తరపున బీద పోటీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఎక్కువ కాలం పాలన సాగించింది.
బీద మస్తాన్‌రావు లాంటి వారు కోట్లకు పడగలెత్తారు. ఇక ఆర్.కృష్ణయ్య విషయానికి వస్తే …2014లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు వ్యూహాత్మకంగా, అనూహ్యంగా ఆయన్ను తెరపైకి తెచ్చారు. తెలంగాణాలో ఆర్.కృష్ణయ్యను అడ్డు పెట్టుకుని బీసీల ఓట్లను కొల్లగొట్టాలని యత్నించారు. అయితే ఎల్‌బీ నగర్ నుంచి ఆర్.కృష్ణయ్య గెలిచారే తప్ప టీడీపీ అధికారంలోకి రాలేక పోయింది.
తాజాగా తన కుటుంబ ఆస్తులు రూ.3.50 కోట్లగా పేర్కొన్నారు. అలాగే రూ.39.26 లక్షలు అప్పు ఉన్నట్టు కృష్ణయ్య చూపారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్.కృష్ణయ్య ఆ పార్టీలో లేరని, అందుకే సంపాదన కూడా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.