ప్రధాన మంత్రి రాష్ట్రానికి వస్తున్నారంటే.. సొంత పార్టీ ముఖ్యమంత్రి అయినా, వైరి వర్గం సీఎం అయినా.. కనీసం మర్యాద కోసం అయినా పలకరిస్తారు. ఏదో మొహమాటానికి అయినా పూల బొకే ఇచ్చి స్వాగతం చెబుతారు. కానీ తెలంగాణలో మోదీకి అలాంటి మర్యాదలేవీ జరగట్లేదు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు.. ఇది మూడోసారి. ప్రధాని మోదీ హైదరాబాద్ కి వస్తున్నారంటే చాలు కేసీఆర్ పక్క రాష్ట్రానికి వెళ్తారు, లేదా ఏదో పర్సనల్ కార్యక్రమం పెట్టుకుంటారు. అంతే కానీ ఆయనకు ఎదురుపడరు, పలకరించరు. పూర్తిగా ఎడమొహం పెడమొహంగా ఉంటారు.
పోనీ మోదీ ఏమైనా తెలంగాణ మారుమూల పల్లెటూరికి వస్తున్నారా అంటే అదీ లేదు.. ఆయన నేరుగా హైదరాబాద్ కే రెండుసార్లు వచ్చారు, మూడోసారి కూడా ఇక్కడికే వస్తున్నారు. కానీ కేసీఆర్ ఇక్కడ లేరు, బెంగళూరు వెళ్తున్నారు. సరిగ్గా మోదీ హైదరాబాద్ వచ్చే సమయానికి కేసీఆర్ పక్క రాష్ట్రంలో ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నారు.
2020 నవంబరు 28న ప్రధాని మోదీ భారత్ బయోటెక్ సందర్శన కోసం హైదరాబాద్ వచ్చారు. అప్పుడు కూడా కేసీఆర్ వెళ్లలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 5న సమతామూర్తి విగ్రహా విష్కరణ కోసం ముచ్చింతల్ వచ్చారు. కానీ కేసీఆర్ వెళ్లలేదు. పైగా ఈ కార్యక్రమం వల్లే కేసీఆర్, చినజీయర్ మధ్య దూరం పెరిగింది. పోనీ అది ఆధ్యాత్మిక కార్యక్రమం అనుకుంటే.. ఇక్రిశాట్ లో జరిగిన అధికారిక కార్యక్రమానికి కూడా కేసీఆర్ వెళ్లలేదు. అప్పుడలా తప్పించుకున్న కేసీఆర్.. ఇప్పుడు ఏకంగా పక్క రాష్ట్రానికే ప్రయాణం కట్టారు.
హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20వ వార్షికోత్సవం, స్నాతకోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ హైదరాబాద్ వస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో భారీ బందోబస్తు ఏర్పాటు కూడా చేశారు. వాస్తవానికి ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ కి కూడా ఆహ్వానం ఉంది. కానీ ఆయనే సున్నితంగా తిరస్కరించారు.
మోదీ అధికారిక పర్యటనకు వస్తుంటే, కేసీఆర్ రాజకీయ పర్యటనకు బయలుదేరారు. బెంగళూరులో జేడీఎస్ నేతలు మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామిని కలవబోతున్నారు కేసీఆర్. ఇటీవల దేశ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయ కూటమికోసం వివిధ పార్టీల నేతల్ని కలుస్తున్న కేసీఆర్.. ఇప్పుడు బెంగళూరులో జేడీఎస్ తో భేటీ అవుతున్నారు. దేశ రాజకీయాలతోపాటు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో కూడా ఆయన చర్చించబోతున్నారు.
ఇక కేసీఆర్ కోసం బెంగళూరులో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అభిమానులు. ఆమధ్య ముంబైలో కూడా ఇలాగే ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు బెంగళూరులో కూడా దేశ్ కీ నేత.. కేసీఆర్ అంటూ ఫ్లెక్సీలు పెట్టారు. ఎవరి పర్యటనలు ఎలా ఉన్నా.. మోదీ ప్రజెంట్, కేసీఆర్ ఆబ్సెంట్.. అనేది మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.