మొత్తానికి ఉదయగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రచ్చకు ఒక ముగింపు లభించినట్టుగా ఉంది. దాదాపు రెండేళ్ల నుంచి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రచ్చ రగులుతూ వస్తోంది. ఒక దశలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డికి వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కారు! ఆయన తీరుపై నిరనస సెగలుకక్కాయి. ఆయన నియోజకవర్గ స్థాయిలో పదవులనూ అమ్ముకుంటున్నారని, డబ్బులు తీసుకుంటూ అన్ని వ్యవహారాలనూ అమ్మకాలకు పెట్టారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన తెలిపాయి. ఈ నియోజకవర్గం నుంచి మేకపాటి చంద్రశేఖర రెడ్డికి గట్టి చరిత్రే ఉంది. ఐదు సార్లు పోటీ చేశారు. నాలుగు సార్లు గెలిచారు. వైఎస్ జగన్ వద్ద పలుకుబడి ఉందనే పేరూ ఉండేది!
అయినప్పటికీ ఈ నియోజకవర్గం నుంచి పోటీ కోసం చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద అప్లికేషన్లు పెట్టుకుంటూ వచ్చారు. వీరిలో కావ్య కృష్ణారెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, మెట్టుకూరు చిరంజీవి రెడ్డి లాంటి వాళ్లు ఉన్నారు. వీరిలో కూడా కావ్య కృష్ణారెడ్డి నియోజకవర్గ స్థాయిలో తన బలగాన్ని పెంపొందించుకునే ప్రయత్నాల్లో చాన్నాళ్ల నుంచినే ఉన్నారు. దీంతో వచ్చేసారి మేకపాటికి టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారం దాదాపు రెండేళ్ల నుంచి ఉన్నదే!
ఈ అంశంపై గతంలో మేకపాటి కూడా స్పందించారు. పార్టీ టికెట్ ఇస్తే పోటీ, లేకపోతే తన పని తాను చేసుకుంటానంటూ ఆయన ఏడాది కిందటే ప్రకటించారు. అయితే అప్పుడు అలా హుందాగానే స్పందించిన మేకపాటికి అప్పటికే టికెట్ దక్కదనే క్లారిటీ ఉండవచ్చు. అయితే తన పొలిటికల్ కెరీర్ కు ఈ సస్పెన్షన్ మకిలిని ఆయన అంటించుకున్నారు. ఇప్పుడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రతి నమస్కారం లేదంటున్నారు. మరి ప్రతి నమస్కారం లేకుండానే మూడు సార్లు టికెట్ పొందారేమో మరి!
నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేపై వైఎస్ఆర్ కాంగ్రెస్ లోనే బాగా అలజడి ఉండిన నియోజకవర్గం ఉదయగిరి. ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులకు ప్రశాంతత దక్కినట్టుగా ఉంది. వచ్చే ఎన్నికల టికెట్ విషయంలో ఆశావహులు తమ ప్రయత్నాలను ఇంకా ముమ్మరం చేసుకునే అవకాశాలున్నాయిక.