లోక్‌సభ సభ్యత్వం రద్దుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి బదులు మరొకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం విశేషం. రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దు కావడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. బీజేపీ, ఆ పార్టీ వ్యతిరేక వర్గంగా విడిపోయి అనర్హత వేటుపై బలమైన వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
దొంగలందరికీ ఇంటి పేరు మోదీ ఉంటుందా? అని రాహుల్‌గాంధీ ఘాటు విమర్శ చేయడం పరువు నష్టం కేసు వేసే వరకూ వెళ్లింది. బీజేపీ ఎమ్మెల్యే వేసిన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఇటీవల రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. తీర్పును సవాల్ చేసేందుకు నెల రోజుల వ్యవధి ఉన్నప్పటికీ, రాహుల్‌పై అనర్హత వేటు వేయడం తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది. ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అనర్హత వేటుపై సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను పీహెచ్‌డీ స్కాలర్, సామాజిక కార్యకర్త ఆబా మురళీధరన్ వేయడం గమనార్హం. ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్8(3) ను సవాల్ చేస్తూ కోర్టులో అతను పిటిషన్ వేశారు. ఆటోమెటిక్‌గా ప్రజాప్రతినిధుల్ని అనర్హులుగా ప్రకటించే సెక్షన్ 8పై మార్గనిర్దేశం చేయాలని సుప్రీంకోర్టును అతను కోరారు.
ఆ సెక్షన్ అక్రమంగా, ఏకపక్షంగా ఉందని పిటిషన్‌లో ఆరోపించారు. సెక్షన్ 8(3) రాజ్యాంగ చెల్లుబాటును పిటిషనర్ ప్రశ్నించడం విశేషం. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా వుంటుందనే ఉత్కంఠకు తెరలేచింది.