విశాఖ గొప్ప సిటీ. దానికి తిరుగులేదు. విభజన తరువాత ఏపీలో పెద్ద నగరం. ఇక ఆసియాలో అతి వేగంగా విస్తరిస్తున్న నగరం కూడా. విశాఖ గురించి ఎవరైనా మంచి మాటలే మాట్లాడుతారు. విశాఖ ఒక అద్భుత గమ్యస్థానంగా కూడా కొనియాడతారు.
అలాంటి విశాఖ గురించి ముఖ్యమంత్రి జగన్ బాబాయ్, ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేశారు. విశాఖ నంబర్ వన్ సిటీగా తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. విశాఖ మీద స్పెషల్ ఫోకస్ ప్రభుత్వానికి ఉందని వైసీపీకి ఒక విజన్ కూడా ఉందని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
అలాగే విశాఖను పరిపాలనా రాజధానిగా చేయడం కూడా జరుగుతుందని ఆయన జోస్యం చెప్పారు. అయితే దానికి కండిషన్స్ అప్లై అన్నట్లుగా ఆయన మరో మాట కూడా చెప్పారు. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతేనే విశాఖను రాజధానిగా చేయడం జరుగుతుందని.
మరి అవి ఎపుడు తొలగిపోతాయన్నది ఎవరికీ తెలియదు. ఎందుకంటే హై కోర్టు అమరావతే ఏకైక రాజధాని అంటూ తుది తీర్పు వెలువరించింది. దాని మీద ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అప్పీల్ కి వెళ్లలేదు. దాంతో న్యాయపరంగా చూస్తే విశాఖ రాజధాని అన్నది కుదిరేది కాదు, మరి ప్రభుత్వం మదిలో హైకోర్టు తీర్పు మీద అప్పీల్ కి వెళ్లే ఆలోచన ఉందా…. ఆ విషయమే నర్మగర్భంగా బాబాయ్ సుబ్బారెడ్డి విశాఖలో చెప్పారా అన్నదే ఆలోచించాల్సిన విషయం.