జవాన్ సినిమా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో, థాంక్యూ సినిమా మీద అంతకు రెట్టింపు ఆశలు పెట్టుకున్నారు రచయిత కమ్ దర్శకుడు బివిఎస్ రవి. జవాన్ సినిమా ఆయనకు దర్శకుడిగా ఓ ప్లేస్ ఇస్తుందనుకున్నారు. కానీ అది విఫలమైంది.
మళ్లీ తెరవెనుక కథలు, మాటలు వండుకుంటూ కాలక్షేపం చేస్తుంటే థాంక్యూ సినిమా మళ్లీ ఆశలు కల్పించింది. ఆ సినిమాకు ఆయన దర్శకుడు కాకపోయినా, కథ, మాటలు అన్నీ ఆయనే. ఈ స్క్రిప్ట్ అద్భుతం, పాయింట్ అమోఘం అంటూ దిల్ రాజు ఆద్యతం తలపై పెట్టుకుని మోసారు. రవి కూడా ప్రమోషన్లలో తానే ఎక్కువ మాట్లాడి సినిమాను ముందుకు తీసుకెళ్లారు.
ఈ సినిమా తరువాత ఏకంగా బాలకృష్ణతో దిల్ రాజు నిర్మించే సినిమాకు బివిఎస్ రవి నే దర్శకుడు అన్న టాక్ కూడా వుంది. ఎందుకంటే బాలకృష్ణ చేసిన చాట్ షో అన్ స్టాపబుల్ కు రవి పని చేసారు. ఆ షో కి చాలా మంది పని చేసినా, రవికి కాస్త ఎక్కువ పేరు వచ్చింది. బాలయ్యతో సినిమాకు అది రూటు వేస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆశలు అన్నీ నీరుగారిపోయాయి.
మామూలుగా సినిమా ఫెయిల్ అయితే అది వేరే సంగతి. కేవలం స్క్రిప్ట్ కారణంగా ఫెయిల్ కావడం అన్నది రవికి మైనస్. తొలిసగంలో ఒక ఎపిసోడ్, మలి సగంలో మరో ఎపిసోడ్ తప్ప సినిమాలో, థాంక్యూ పాయింట్ కు అదనంగా ఏమీ లేదు. పైగా తొలి ఎపిసోడ్ యండమూరి ఆనందో బ్రహ్మ నవలలో ని కొన్ని పాయింట్లకు దగ్గరగా వుంటుంది. మలి ఎపిసోడ్ పరమ నీచం. అది అటు జోష్, ఇటు శివ టైపు ఎపిసోడ్.
అందువల్ల సినిమాకు పెద్ద మైనస్ స్క్రిప్ట్ కనుక, ఫెయిల్యూర్ మొత్తం బివిఎస్ రవి ఖాతాలోకి పోతొంది. అందువల్ల మరోసారి మెగాఫోన్ పట్టుకోవాలనుకున్న ఆయన కల ఇప్పట్లో నెరవేరకపోవచ్చు.