అన్ని ప్రాంతాలకూ అభివృద్ధిని పంచాలన్న ఉద్దేశ్యంతోనే విశాఖను రాజధాని చేయాలని వైసీపీ ప్రభుత్వం సంకల్పించిందని టీటీడీ చైర్మన్, ఉమ్మడి విశాఖ వైసీపీ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మూడు రాజధానులతో మూడు ప్రాంతాలూ బాగుంటాయని వివక్ష లేని ఆంధ్రాను అంతా చూస్తారని అన్నారు.
ముఖ్యమంత్రి అయ్యాక జగన్ మూడు రాజధానులతో పాటు ఏపీలో 26 కొత్త జిల్లాల గ్రామాలలో పెద్ద ఎత్తున సచివాలయాలు ఏర్పాటు చేస్తూ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. పరిపాలనా వికేంద్రీకరణ తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
న్యాయపరమైన చిక్కులు అన్నీ పూర్తిగా తొలగిపోయాకే విశాఖను రాజధానిగా ప్రకటిస్తామని ఆయన చెప్పారు. విశాఖ రాజధానిని చేసే విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన అన్నారు.
అమరావతి రైతుల పాదయాత్రను రియల్ ఎస్టేట్ వ్యాపారుల మద్దతు యాత్రగా అభివర్ణించిన ఆయన ఉత్తరాంధ్రా ప్రజల మనోభావాలను దెబ్బతెస్తే అక్కడ ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు. అందరూ బాగుండాలన్నదే ప్రభుత్వ విధానమని అదే జగన్ విధానమని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.