సికింద్రాబాద్ లో హోటల్ దగ్ధమై పలువురు మృతి చెందిన ఘటన వెనుక ఎలక్ట్రిక్ బైక్ ల బ్యాటరీల పేలుడే కారణమనే వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఎలక్ట్రిక్ వెహికల్స కాస్త భయపెడుతున్నాయి. ఇది వరకూ జరిగిన పలు సంఘటనలు కూడా ఈ సందర్భంగా చర్చనీయాంశం అవుతున్నాయి. గత కొన్నేళ్లలో ఇ-బైక్ ల వాడకం పెరుగుతూ ఉంది. పట్టణాలతో మొదలుపెడితే, గ్రామీణ ప్రాంతాల వరకూ ఇవి ఇప్పుడిప్పుడు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటి బ్యాటరీల పేలుడు వల్ల కొందరు ప్రాణాలు కోల్పోయిన దాఖలాలు కూడా ఉన్నాయి.
ఎంతో ఇష్టంతో, పర్యావరణానికి కూడా హితమైనవి అని చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటున్నారు. ఇలాంటి వాటితో 99.9 శాతం ప్రమాదాలు జరగడం లేదు కానీ, 0.01 శాతం లోపు ప్రమాదాలు మాత్రం కాస్త భయపెడుతున్నాయి. ఇది వరకూ ఇ-బైక్ ల బ్యాటరీలు చార్జింగ్ లో ఉంచినప్పుడు అవి పేలి కొందరు మృత్యువాతపడ్డారు. చార్జింగ్ లో పెట్టిన బ్యాటరీ పేలడంతో విపరీతంగా పొగ చుట్టుకుని వారు మరణించారు. సికింద్రాబాద్ లో కూడా దాదాపు ఇలాంటి సంఘటనే జరిగింది.
ఎలక్ట్రిక్ బైక్ ల షోరూమ్ లో చార్జింగ్ పెట్టిన బ్యాటరీ పేలడం, దానితో పాటు ఇతర వాహనాలకు మంటలంటుకోవడం.. దాని ప్రభావం వల్ల షోరూమ్ పైనే ఉన్న లాడ్జి కి మంటలు, పొగ వ్యాపించడంతో.. అందులో ఉన్న వారు బయటకు వచ్చే మార్గం లేక కొందరు మరణించారు. అననుకూల భవనంలో లాడ్జిని నిర్వహిస్తూ ఉండటంతో సహా.. ఆ భవనం కట్టడంలో పరిమితులను మీరడంతో సహా ఎన్నో కారణాలు ఉన్నాయి ఈ దుర్ఘటన వెనుక. అయితే ప్రధాన కారణం మాత్రం చార్జింగ్ లో ఉన్న బ్యాటరీ పేలుడే అని ప్రాథమికంగా నిర్ధారిస్తూ ఉన్నారు.
ఒకవేళ మామూలుగా బ్యాటరీ పేలి ఉంటే.. కొంత ప్రమాదమే జరిగేది. పైన లాడ్జి ఉండటం వల్లనే దారుణం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ బ్యాటరీలన్నీ పేలుతాయని కాదు, ఈ అంశంపై నిపుణులు ఏమంటారంటే.. కొన్ని సార్లు ప్రయాణ సమయంలో బ్యాటరీలో మార్పులు చోటు చేసుకుంటాయని, ప్రత్యేకించి ఎగుడుదిగుడు రోడ్లలో ప్రయాణం వల్ల బ్యాటరీలో చోటు చేసుకునే మార్పుల అనంతరం, చార్జింగ్ పెట్టినప్పుడు అది పేలే అవకాశాలు కొంత వరకూ ఉంటాయనేది వారు చేస్తున్న విశ్లేషణ.
సమాజంలోకి ఇప్పుడిప్పుడే వాడకంలోకి వస్తున్న ఇ-బైక్స్ వల్ల కాలుష్య రాహిత్యం అనే సానుకూల అంశం ఉన్నా, ఇలాంటి సంఘటనలు కాస్త భయానికి గురి చేస్తున్నాయి.