వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచీ అన్ని రకాల విమర్శలు అయ్యాక ప్రతిపక్షాలు ప్రస్తుతం దంచుతున్న విమర్శ ఒక్కటే- ఆదాయన్ని పెంచే మార్గం లేకుండా పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారు అని. ఇదంతా ఒకటే వాక్యంలా కనిపిస్తున్నా దీనిని మూడు భాగాలుగా విడదీసి చూసుకోవాలి.
1. పథకాలు పంచడం:
పేదలకి పథకాలు పంచడం అనేది ఆర్థిక శాస్త్రం తెలిసిన వాడెవడైనా “శభాష్” అనే అంటాడు. తెలియని వాడు మాత్రం “పథకాలంటే ఊరికే పంచి పెట్టి ప్రజల్ని సోమరుల్ని చేయడమే” అంటాడు. ఒక్కసారి అగ్రరాజ్యం అమెరికాకేసి చూద్దాం. అక్కడ 2020 లో కరోనా దెబ్బకి ఆర్థిక వ్యవస్థ నడుం విరిగి కూర్చుంటోందని గ్రహించి అప్పటి ప్రభుత్వం ధనిక, పేద తేడా లేకుండా అందరికీ డబ్బులు పంచేసింది. ఎలా పంచిందో తెలుసుకుంటే తెలియనివాళ్లు నోరెళ్లబెడతారు.
ఉదాహరణకి 2019 లో ఒక హోటల్ లక్ష డాలర్ల ఆదాయం సంపాదించిందనుకుందాం. కరోనా దెబ్బకి ఆ ఆదాయం 20 వేలకి పడిపోయిందనుకుందాం. 2019 లెక్క చూపిస్తే చాలు 80 వేల డాలర్లు ప్రభుత్వం ఇచ్చేసింది.
మా ఆఫీసులో 50 మంది ఉద్యోగులున్నారు, వాళ్లకి జీతాలివ్వడానికి వ్యాపారం జరగట్లేదని ఏ కంపెనీ అయినా ప్రభుత్వానికి చెప్పుకుంటే చాలు..ఒక ఏడాదికి సరిపడా ఉద్యోగులకి జీతాలివ్వడానికి కూడా ప్రభుత్వం డబ్బులు పంచేసింది.
ఆ డబ్బు మళ్లీ మార్కెట్లోకొచ్చింది. ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి కొంత చేరింది. దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలకుండా నిలబడింది.
అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా మ్యానిఫెస్టొలో చెప్పిన నవరత్నాలు అనుకోకుండా కరోనా కాలంలో పేదలని ఆదుకున్నాయి. సగటున ప్రతి పేదవాడు నెలకి 5000-10000 రూపాయల మధ్య ప్రభుత్వం నుంచి అందుకుంటున్నాడు. వాటితో కడుపునిండా తింటున్నాడు, బట్టలు కొనుక్కుంటున్నాడు. అంటే డబ్బుని మళ్లీ మార్కెట్ కే ఇస్తున్నాడు. అటు నుంచి మళ్లీ ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికొస్తున్నట్టే కదా.
కనుక పథకాల వల్ల లాభమే తప్ప నష్టం ఉండదు. మరి వీటిని నడపాలంటే ఆదాయం కావాలి. అది లేనప్పుడు అప్పులు చేసి పంచాలా అనేది ప్రశ్న. ఇక ఆ విషయానికొద్దాం.
2: అప్పులు చేసి పంచడం:
మనిషిని, రాష్ట్రాన్ని ఒకేలా చూడడం సరికాదు. ఉదాహరణకి ఒక మనిషి తన దగ్గర ఉన్నదాంట్లో కొంతిస్తే దానం, అంతా ఇస్తే త్యాగం, అప్పు చేసి దానం చేస్తే పిచ్చితనం అనొచ్చు. కానీ రాష్ట్రం గానీ, దేశంగానీ అప్పు చేసి పథకాల రూపంలో దానం చేయడమనేది పిచ్చితనం అవ్వదు.
ఎందుకంటే ఒక మనిషి అప్పులపాలయ్యి తిరిగి కట్టలేకపోతే అప్పులిచ్చిన వాళ్లు వాడిని కొట్టొచ్చు, కోర్టుకీడ్చొచ్చు, వాడికున్న ఆస్తుల్ని వేలం వేసి పట్టుకుపోవచ్చు. మరి రాష్ట్రం గానీ దేశంగానీ తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోతే ఏమౌతుందో ఎప్పుడన్నా ఆలోచించారా?
ఈ ప్రపంచంలో అప్పు చేయని దేశం లేదు. అమెరికాకున్నంత అప్పు ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఏ దేశమైనా అప్పు తీర్చలేని పరిస్థితి రావడం, ఆ దేశాన్ని అప్పిచ్చిన దేశం ఆక్రమించుకోవడం ఎక్కడైనా జరిగిందా? అలాంటి పరిస్థితే వస్తే అక్కడ కూడా జరిగేది వ్యాపారమే. భూభాగాన్ని ఆక్రమించేసుకోవడం జరగదు కానీ అప్పిచ్చిన దేశం తాలూకు ఉత్పత్తులు అప్పు పుచ్చున దేశంలో అమ్మమంటారు. స్వదేశీ ఉత్పత్తులు కాకుండా విదేశీ ఉత్పత్తులు రాజ్యమేలే పరిస్థితికి ఇది కూడా ఒక కారణం.
మన దేశం చైనా లాగ స్వదేశీ ఉత్పత్తుల విషయంలో ముందంజలో ఎప్పుడూ లేదు. చైనాలో చిన్న సూది నుంచి సాఫ్ట్ వేర్ వరకూ అన్నీ స్వయంగా తయారు చేసుకునే ఇండస్ట్రీస్ ఉన్నాయి. కనుక అలాంటి దేశానికి సొంత ఉత్పత్తుల్ని పక్కనపెట్టి మావి అమ్మండి అని ఏ దేశమన్నా అంటే బాధ కలగొచ్చు.
మనకా బాధ లేదు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా అసలు మన ప్రభుత్వానికి ఆ సంకల్పమూ లేదు, యువతకి ఆ ఆలోచనా లేదు. “మేకిన్ ఇండియా” నినాదంగా ఉంది తప్ప నిదానంగా అయినా అది కదలడం లేదు. కారణం మన యువతకి ఎప్పుడెప్పుడు విదేశాలకి చెక్కేసి ఎమ్మెన్సీలో పనిచేసి డాలర్లు సంపాదిద్దామనే కోరిక తప్ప స్వదేశంలో ఊడపొడుద్దామనే ధృఢ నిశ్చయం, దానికి తగ్గ ప్రభుత్వ ప్రోత్సాహం రెండూ లేవిక్కడ.
కనుక మన దేశంగానీ, రాష్ట్రం గానీ తీర్చలేనంత అప్పులపాలైనప్పుడు మహా అయితే ఇంకొన్ని విదేశీ సరుకులు దిగుతాయి తప్ప అంతకుమించిన ఉపద్రవాలేవీ ముంచుకొచ్చేయవు. కొత్త ఒప్పందాలు చేసుకోవడం, కొత్త అప్పులు తెచ్చుకోవడం అంతే..! అంటే మరి అభివృద్ధి అక్కర్లేదా? అనే ప్రశ్న వస్తుంది. దాని విషయానికొద్దాం.
3. అభివృద్ధి:
ఇది కచ్చితంగా కావాలి. ఆ. ప్ర ముఖ్యమంత్రి వీక్ వికెట్లా కనిపిస్తున్నది ఈ విషయంలోనే. కొత్త కర్మాగారాలు తీసుకురావాలి, కొత్త పెట్టుబడులు లాక్కురావాలి, రాష్ట్రంలో బలమైన జాతీయ, అంతర్జాతీయ స్థాయి బిజినెస్ సెంటర్స్ ని నెలకొల్పాలి. ఇది అందరికీ తెలుసు. మరి ఎందుకు జరగట్లేదు? పార్టీని 2019 ఎన్నికల్లో గెలిపించుకోవడానికి ప్రశాంత్ కిషోర్ కంపెనీని ఆశ్రయించాల్సి వచ్చింది వైసీపీ.
కాకలు తీరిన రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినా సొంత తెలివితేటలు వాడకుండా, సొంత మనుషుల్ని నమ్మకుండా ఉత్తరభారత దేశం వాడిని నమ్ముకుని ముందుకెళ్లారు. నిష్పక్షపాతమైన సర్వేలు, రాజీ పడని లెక్కలతో ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు గెలిచారు. ఇప్పుడు ఆ.ప్ర రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థని చక్కబరచడానికి ప్రశాంత్ కిషోర్ లాంటివాడొకడు కావాలి.
ఎందుకండీ..మన ఐ.ఏ.ఎస్ లు సరిపోరా? మంత్రులేం పీకుతారు? అని అడగొచ్చు. వాళ్ళు సరిపోరు. ఎందుకంటే మంత్రులైనా, ఐ.ఏ.ఎస్ లైనా అధికారం కింద బతుకుతున్న వాళ్ళే. ఏం చెప్తే హై కమాండ్ కి ఏం కోపమొస్తుందో అని కొందరు, గట్టిగా చెబితే ట్రాన్స్ఫర్ ఆర్డరొస్తుందేమోనని అధికారులు, చెప్పినా తమ సొంత లెక్కలతో “అది పక్కన పెట్టి ఇది చెయ్యవయ్యా కలెక్టరూ!” అనే రాజకీయ నాయకులు ఉండే వ్యవస్థ కనుక ఇక్కడ ఏదీ జరగాల్సిన స్పీడులో జరగదు.
అలా కాకుండా అధికారానికి భయపడాల్సిన అవసరం లేని ఒక ఇండిపెండెంట్ ప్రైవేట్ కన్సల్టింగ్ కంపెనీ సీన్లోకి వస్తే ఫలితాలు వేరేగా ఉంటాయి. ఆ పని వెనువెంటనే చెయ్యాలి ఆ.ప్ర ముఖ్యమంత్రి.
ఎక్కడ ఎలాంటి పెట్టుబడులు తీసుకురావాలి, ఎప్పుడు ఎవరితో సంప్రదింపులు జరపాలి, రాష్ట్రంలో వనరులేంటి, అవకాశాలేంటి.. కాసుల్ని ఎలా పండించాలి అనే సూత్రాలు అటువంటి కన్సల్టింగ్ కంపీనీలు చెప్పగలిగినట్టు మన అధికారులు కూడా చెప్పలేరు. చెప్పలేకపోవడానికి కారణం నాలెడ్జ్ కాకపోవచ్చు గానీ పైన చెప్పుకున్న వ్యక్తిగత అంశాలు ఉండుండొచ్చు.
2014 ఎన్నికల్లో సొంత వాళ్లని నమ్ముకున్న జగన్ ఓడిపోయారు. క్షేత్రస్థాయిలో అలా ఉంది ఇలా ఉంది అంటూ తప్పుడు లెక్కలతో జగన్ ని ఉక్కిరి బిక్కిరి చేసి తప్పుటడుగులు వేయించారు. 2019 లో మాత్రం వాళ్లని నమ్మకుండా ప్రశాంతంగా ప్రశాంత్ కిషోర్ ని నమ్ముకుని గెలిచారు.
“ప్రస్తుతానికి పథకాలిలా కొనసాగిస్తే చాలు మళ్లీ 2024లో అధికారం మనదే” అనే పాట పాడుతున్నారు జగన్ చుట్టూ ఉన్న కొందరు. ఆ పాట వింటూ మైమరిస్తే మాత్రం జగన్ కి 2014 ఫలితం రిపీట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆదాయం పెంచే పనులు మొదలుపెట్టి ముమ్మరం చెయ్యాలి. ప్రైవేట్ కంపెనీని హైర్ చేసుకోవడం, తీసుకొచ్చిన పెట్టుబడుల్లో పర్సెంటేజ్ ఇస్తామని మాట్లాడుకోవడం. తక్కిన పని దానంతటదే జరుగుతుంది.
– భాస్కర రావు మంత్రిప్రగడ