Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఆలపాటి అలక.. నాదెండ్లకు గండమేనా?

ఆలపాటి అలక.. నాదెండ్లకు గండమేనా?

రాజకీయంగా తాను నిత్యం పవన్ కల్యాణ్ సేవలోనే గడిపేస్తూ ఉండినప్పటికీ.. ఎన్నికల సీజను వచ్చే సరికి వాయుమార్గంలో వచ్చి.. తెనాలి సీటు దక్కించుకున్నారు నాదెండ్ల మనోహర్. మరి ఇన్నేళ్లుగా అక్కడ తెలుగుదేశం పార్టీకోసం పనిచేస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజా సంగతేమిటి? అనేది అందరికీ తొలినుంచి ప్రశ్నగానే ఉంది.

తాజా పరిణామాల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్ అలక తారస్థాయికి  చేరుకుంది. ఆయన తెలుగుదేశం పార్టీని వీడుతారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. అదే జరిగితే నాదెండ్ల మనోహర్ పరిస్థితి ఏమిటి? తన సొంత బలం పరిమితంగానే ఉండగా.. తెలుగుదేశం బలం కూడా తోడైతే ఎమ్మెల్యేగా గెలవచ్చునని అనుకున్న నాదెండ్ల మనోహర్.. ఇప్పుడు ఆలపాటి తిరుగుబాటు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారా? అనేది పెద్ద ప్రశ్నగా ఉంది.

ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలుగుదేశంలో సీనియర్ నాయకుడు. నియోజకవర్గంలో కూడా పట్టున్న నాయకుడు. గత ఏడాది జగన్ హవాలో ఆయన రెండోస్థానానికి వెళ్లినా గణనీయంగానే ఓట్లు వచ్చాయి. అప్పట్లో జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ మూడో స్థానంలో నిలిస్తే 30 వేల ఓట్లు కూడా రాలేదు. ఈసారి ఎన్నికలు వచ్చేసరికి, నాదెండ్ల ముందే తాను అక్కడినుంచి పోటీచేస్తున్నట్టుగా ప్రకటించేసుకోవడం.. అలాగే పవన్ కూడా ముందుగానే ఆయన గురించి ప్రకటనలు చేయడం పొత్తుకు ముందే రాజాలో అనుమానాలు పుట్టించాయి. తీరా పొత్తులు వచ్చేసరికి సీటు చేజారిపోయింది. చంద్రబాబు ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ వచ్చారు.

ఆలపాటి రాజా.. కనీసం తనకు ప్రత్యామ్నాయంగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గం అయినా ఇవ్వాలని కోరగా అందుకు కూడా చంద్రబాబు ఒప్పుకోలేదు. అక్కడి నుంచి మాధవీలతను బరిలో దించారు. తనకు ఏదో ఒక సీటు సర్దుబాటు చేరస్తారనే ఆశ ఆయనలో ఇన్నాళ్లు ఉండేది. పవన్ కోసం పిఠాపురంలో వర్మ ను బలిపెట్టి, ఆయనను తొలివిడతలో ఎమ్మెల్సీ చేస్తానని చంద్రబాబు బుజ్జగించారు.

మైలవరం స్థానాన్ని కొత్తగా పార్టీలోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు కేటాయించి.. దేవినేని ఉమాను డైలమాలోకి నెట్టారు. దేవినేని ఉమాకు పెనమలూరు సీటు ఇస్తానని చెప్పి ఆశ పెట్టారు. తీరా పెనమలూరులో బోడె ప్రసాద్.. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఇండిపెండెంటుగా బరిలోనే ఉంటానని తెగేసి చెప్పేసరికి దేవినేని ఉమాకు హ్యాండ్ ఇచ్చారు.

ఇప్పుడు ఆలపాటి రాజా అలక ఏంటంటే.. పిఠాపురం వర్మ అలిగితే ఎమ్మెల్సీ హామీ వచ్చింది. బోడెప్రసాద్ అలిగితే ఎమ్మెల్యే సీటే దక్కింది. తన పరిస్థితే అగమ్యగోచరంగా మారిందని ఆయన కోపగించుకున్నారు. అందుకే పార్టీని వీడడానికి నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఆలపాటి రాజా వైసీపీలో చేరినా, లేదా ఇండిపెండెంటుగా బరిలో ఉన్నా.. మొత్తానికి నాదెండ్లకు మాత్రం గడ్డు పరిస్థితి తప్పకపోవచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?