జ‌న‌సేన సీట్ల‌పై బాంబు పేల్చిన ఆంధ్ర‌జ్యోతి!

పొత్తులో భాగంగా జ‌న‌సేన‌కు టీడీపీ ఇచ్చే సీట్ల‌పై ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక రాజ‌కీయ బాంబు పేల్చింది. ఈ క‌థ‌నంలో నిజానిజాల సంగ‌తి ప‌క్క‌న పెడితే, జ‌న‌సేన శ్రేణుల‌కు గ‌ట్టి షాక్ ఇచ్చింది. జ‌న‌సేన‌కు 20 సీట్లు…

పొత్తులో భాగంగా జ‌న‌సేన‌కు టీడీపీ ఇచ్చే సీట్ల‌పై ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక రాజ‌కీయ బాంబు పేల్చింది. ఈ క‌థ‌నంలో నిజానిజాల సంగ‌తి ప‌క్క‌న పెడితే, జ‌న‌సేన శ్రేణుల‌కు గ‌ట్టి షాక్ ఇచ్చింది. జ‌న‌సేన‌కు 20 సీట్లు ఇచ్చేందుకు మాత్రం చంద్ర‌బాబు అంగీక‌రించార‌ని చంద్ర‌బాబును ఆరాధించే వీర భ‌క్తుడిగా పేరొందిన మీడియా అధిప‌తికి సంబంధించిన ప‌త్రిక‌లో రాయ‌డం విశేషం. కాదు, కూడ‌దంటే మ‌రో ఐదు అసెంబ్లీ సీట్లు పెంచే అవ‌కాశం వుంద‌ని ఆ క‌థ‌నంలో పేర్కొన్నారు.

జ‌న‌సేన ఆత్మ గౌర‌వాన్ని కాపాడుకునేలా పొత్తు వుంటుంద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు. జ‌న‌సేన‌కు 60 అసెంబ్లీ, ఐదారు లోక్‌స‌భ సీట్ల‌తో పాటు అధికారంలో భాగ‌స్వామ్యం ఇస్తేనే ఓట్ల బ‌దిలీ స‌జావుగా సాగుతుంద‌ని కాపు ఉద్య‌మ నాయ‌కులు ప‌లు సంద‌ర్భాల్లో బ‌హిరంగంగానే వెల్ల‌డిస్తూ వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన‌కు క‌నీసం 40 అసెంబ్లీ, నాలుగు ఎంపీ సీట్లైనా ఇస్తార‌ని ఆ పార్టీ నాయ‌కులు ఆశించారు.

జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లేలా టీడీపీ సొంత ప‌త్రిక క‌థ‌నం రాయ‌డం గ‌మ‌నార్హం. ఈ క‌థ‌నం సారాంశం ఏంటంటే… బాబుతో ఆదివారం రెండు ద‌ఫాల్లో భేటీలో భాగంగా జ‌న‌సేనాని 32 అసెంబ్లీ, మూడు లోక్‌స‌భ స్థానాల‌ను  అడిగారు. ఇందులో 20 సీట్లు ఇచ్చేందుకు చంద్ర‌బాబు అంగీక‌రించారు. టీడీపీ మ‌రో ఐదు సీట్లు ఇచ్చే అవ‌కాశం వుంది. ప‌వ‌న్ మ‌రో ఏడు సీట్లు అడుగుతున్నారు.

ఈ క‌థ‌నాన్ని లోతుగా ప‌రిశీలిస్తే.. జ‌న‌సేన‌కు ఎక్కువ సీట్లు ఇస్తే చంద్ర‌బాబుకు న‌ష్టం వ‌స్తుందనే ఉద్దేశంతో ప‌వ‌న్‌క‌ల్యాణే త‌క్కువ డిమాండ్ చేశారన్న‌ట్టుగా వుంది. జ‌న‌సేన ఆత్మ గౌర‌వాన్ని చంద్ర‌బాబు ఇంటికెళ్లి మ‌రీ తాక‌ట్టు పెట్టిన‌ట్టుగా వుంద‌ని ఆ పార్టీ నాయ‌కులు ఆగ్ర‌హంగా ఉన్నారు. ఎల్లో మీడియాని అడ్డు పెట్టుకుని జ‌న‌సేన‌తో చంద్ర‌బాబు మైండ్ గేమ్ స్టార్ట్ చేశార‌ని ముందే చెప్పుకున్నాం. నేడు అదే నిజ‌మైంది.

ప‌దేళ్ల జ‌న‌సేన పార్టీ ప‌ట్టుమ‌ని 20 సీట్ల‌లో పోటీ చేయ‌డానికా టీడీపీతో పొత్తు పెట్టుకున్న‌ద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. బీసీల త‌ర్వాత అత్య‌ధిక జ‌నాభా, ఓటు బ్యాంక్ క‌లిగి ఉన్నామ‌ని కాపు నాయ‌కులు చెబుతుంటారు. జ‌న‌సేన పార్టీ త‌మ‌ద‌ని ప‌వ‌న్‌కు అండ‌గా నిలుస్తామ‌ని కొంద‌రు కాపు ఉద్య‌మ నేత‌లు గొప్ప‌లు చెబుతుంటారు. ఎవ‌రి కాపు కాయ‌డానికి ఇంత త‌క్కువ సీట్ల‌కు టీడీపీతో పొత్తు కుదుర్చుకున్నార‌నే నిల‌దీత‌ల‌కు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది.