మంత్రి ఆర్కే రోజాపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ నీచమైన భాష వాడారు. రాజకీయాల్లో ఇలాంటి అభ్యంతరకర భాషను ఎవరూ సమర్థించకూడదు. రాజకీయాల్లో తక్కువ సంఖ్యలో మహిళలున్నారు. అందుకే మహిళా బిల్లు కోసం ఏళ్ల తరబడి మన సమాజం ఎదురు చూసింది. ఎట్టకేలకు ఆ బిల్లు అత్యున్నత చట్టసభల్లో ఆమోదానికి నోచుకుంది. రానున్న రోజుల్లో రాజకీయాల్లో మహిళ పాత్ర పెరిగే అవకాశం వుంది.
కానీ ఏపీ రాజకీయాల్లో మహిళలపై నీచమైన భాష వింటుంటే… వారు ముందుకొచ్చేందుకు భయపడే పరిస్థితి. ఇప్పుడు మంత్రి రోజా బాధితురాలైతే, రేపు బ్రాహ్మణి, భువనేశ్వరి కన్నీళ్లు కార్చాల్సి వుంటుంది. అందుకే మహిళల విషయంలో గౌరవప్రదమైన భాషను వాడడం రాజకీయాలకు అతీతంగా అందరూ అలవరచుకోవాలి. ప్రత్యర్థులకు రోజా వాయిస్ ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆమె వ్యక్తిత్వాన్ని కించపరచడం ద్వారా నోరు మూయించాలని టీడీపీ ఓ పథకం ప్రకారం ముందుకెళుతోంది.
కానీ తెలుగు మహిళా నాయకురాళ్లు రోజాపై అభ్యంతరకర భాషను సమర్థించడం గమనార్హం. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా రోజా మాదిరిగానే బాధితురాలు. అయినా ఆమెకు ఎదుటి పార్టీ మహిళా నాయకురాలపై బండారు నీచమైన భాష వినసొంపుగా వుండడం విమర్శలకు తావిస్తోంది. బహుశా అనిత మళ్లీమళ్లీ తనపై అలాంటి బజారు భాష ప్రయోగించాలని కోరుకుంటున్నారేమో అనే అనుమానం కలుగుతోంది.
రోజా ఆవేదన అనితకు డ్రామాగా అనిపిస్తోంది. ఆమె కన్నీళ్లు గ్లిజరిన్ ఏడుపుగా తోస్తోంది. తనపై రోజా నీచమైన భాష వాడారని ఆమె అనడం గమనార్హం. అంతకంటే బండారు నీచమైన భాష మాట్లాడారా? అని ప్రశ్నించడం అనితకే చెల్లింది. భువనేశ్వరిపై విమర్శలు చేస్తున్నప్పుడు రోజా నవ్విన నవ్వును తాము ఎప్పటికీ మరిచిపోలేమని అనిత చెప్పారు. చంద్రబాబు జైలుకు వెళితే స్వీట్లు పంచుతావా? అని రోజాను ఆమె ప్రశ్నించారు.
అనిత చెబుతున్న ప్రకారం ఇక ఎవరైనా ఎలాంటి భాషైనా వాడొచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలిగా రోజాపై బండారు అభ్యంతరకర భాషను ఆమె సమర్థిస్తున్నారు. ఇప్పుడు రోజాను బండారు తిడితే సంబరపడడం కాదు, రేపు అంతకు మించి టీడీపీ పెద్దల కుటుంబాల మహిళలపై ప్రత్యర్థులు అభ్యంతరకర భాషను ప్రయోగిస్తే, ఆ బాధ ఏంటో అర్థమవుతుంది.
మహిళలపై నీచమైన భాషను అన్ని పార్టీల వాళ్లు నిషేధించాలి. ఇలా ఒకరికొకరు తమను అనలేదా? అని ప్రశ్నించడం, సమర్థించడం మొదలైతే, అంతిమంగా స్త్రీలే బాధితులుగా మిగులుతారు. రాజకీయాల్లోకి రావడానికి భయపడతారు. అలాంటి పరిస్థితులే కావాలనుకుంటే, పురుషులేం ఖర్మ, ఇప్పటి నుంచి మహిళలే బండారు, అయ్యన్నపాత్రుడిలా నోరు పారేసుకోవచ్చు.