రాజు గారు రంగంలోకి దిగుతారా..?

తెలుగుదేశం పార్టీ పుట్టుక నుంచి ఉన్న నాయకులు చాలా మంది ఈ రోజున పార్టీలో క్రియాశీలంగానే ఉన్నారు. అలాంటి వారిలో ఉత్తరాంధ్రాలో పూసపాటి వంశీకుడు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఉన్నారు. ఆయన…

తెలుగుదేశం పార్టీ పుట్టుక నుంచి ఉన్న నాయకులు చాలా మంది ఈ రోజున పార్టీలో క్రియాశీలంగానే ఉన్నారు. అలాంటి వారిలో ఉత్తరాంధ్రాలో పూసపాటి వంశీకుడు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఉన్నారు. ఆయన చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు.

అశోక్ 1978లోనే జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. 1983లో ఆయన టీడీపీలో చేరి నాటి నుంచి ఎన్టీఆర్, చంద్రబాబు సారధ్యంలో కొనసాగుతూ వచ్చారు.  టీడీపీ 1995లో చీలినపుడు బాబు వర్గానికి ప్రెసిడెంట్ గా ఒక దశలో అశోక్ పేరు వినిపించింది.

అయితే అశోక్ గజపతిరాజు ఆ తరువాత కీలక మంత్రి పదవులు నిర్వహిస్తూ అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో నంబర్ టూ గా కొనసాగుతూ వచ్చారు. చంద్రబాబుకు బెయిల్ రాకపోయినా మరి కొన్నాళ్ళు ఆయన జైలులో ఉండాల్సి వచ్చినా టీడీపీకి సారధ్యం వహించే బాధ్యతను అశోక్ కి అప్పగిస్తే బాగుంటుంది అన్న ప్రచారం తమ్ముళ్లలో మొదలైంది.

ఏడు పదులు దాటిన అశోక్ పార్టీని నిబద్ధత కలిగిన నేతగా ఉన్నారని, బాబుకు ఆయన అత్యంత విశ్వాసపాత్రుడు కాబట్టి ఆయన నేతృత్వంలో పార్టీని ముందుకు నడిపితే బాగుంటుందని సలహా సూచనలు వస్తున్నాయట. 

ఒక వైపు నారా ఫ్యామిలీకి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్లు ఉన్నా సీనియర్లు ఎంతో మంది ఉన్నారు కాబట్టి వారినే పెద్దగా పెట్టి ముందుకు నడపాలని సూచనలు వస్తున్నాయట. అశోక్ ఈ కీలక సమయంలో టీడీపీ సారధిగా ముందుకు వస్తారా లేదా అన్నది తమ్ముళ్ళు తర్కించుకుంటున్నారు.