Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఇబ్బంది క‌లిగించింటే... మ‌న‌సులో పెట్టుకోవ‌ద్దు

ఇబ్బంది క‌లిగించింటే... మ‌న‌సులో పెట్టుకోవ‌ద్దు

మీడియాకి ఇబ్బంది క‌లిగించి వుంటే మ‌న‌సులో పెట్టుకోవ‌ద్ద‌ని క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విన్న‌వించారు. క‌ర్నూలు విశ్వ‌భార‌తిలో ఈ నెల 19వ తేదీ నుంచి చికిత్స పొందుతున్న త‌న త‌ల్లి శ్రీ‌ల‌క్ష్మి ఆరోగ్యం మెరుగుప‌డింద‌ని ఆయ‌న అన్నారు. ఇవాళ ఆమెని డిశ్చార్జ్ చేస్తున్న‌ట్టు అవినాష్‌రెడ్డి వెల్ల‌డించారు. మెరుగైన వైద్యం కోసం హైద‌రాబాద్‌కు త‌ర‌లిస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.

ఈ నెల 19న సీబీఐ విచార‌ణ ఎదుర్కోవాల్సిన అవినాష్‌రెడ్డి... అక‌స్మాత్తుగా త‌ల్లికి అనారోగ్యంగా ఉంద‌ని, పులివెందుల‌కు బ‌య‌ల్దేరారు. మార్గ‌మ‌ధ్యంలో తాడిప‌త్రి వ‌ద్ద త‌ల్లిని అవినాష్‌రెడ్డి ప‌రామ‌ర్శించారు. ఆ త‌ర్వాత త‌ల్లితో పాటు అంబులెన్స్‌లో క‌ర్నూలు విశ్వ‌భార‌తి ఆస్ప‌త్రికి అవినాష్‌రెడ్డి వెళ్లారు. గ‌త ఆరు రోజులుగా త‌ల్లి వద్దే అవినాష్ ఉంటున్నారు. ఈ ఆరు రోజుల్లో అనేక నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

సీబీఐ అధికారులు క‌ర్నూలుకు వెళ్లార‌ని, అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయ‌నున్నారంటూ పెద్ద ఎత్తున వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. కొన్ని సంద‌ర్భాల్లో మీడియా అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించ‌డంతో అవినాష్‌రెడ్డి అనుచ‌రులు దాడికి తెగ‌బ‌డ్డారు. దీంతో ఎల్లో మీడియా ఆందోళ‌న‌కు దిగింది. అవినాష్‌రెడ్డి అరెస్ట్‌పై ఉన్న‌వి, లేనివి క‌థ‌నాలు ప్ర‌చురించారు, ప్ర‌సారం చేశారు. ఈ నేప‌థ్యంలో త‌ల్లిని డిశ్చార్జి చేస్తున్న సంద‌ర్భంగా అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

క‌ర్నూలు నుంచి హైద‌రాబాద్‌కు వెళుతూ... మ‌న‌సులో పెట్టుకోవ‌ద్ద‌ని చెప్ప‌డం విశేషం. మీడియా ప్ర‌తినిధుల ఇగోను చ‌ల్చార్చేందుకు అవినాష్‌రెడ్డి ప్ర‌య‌త్నించార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇవాళ అవినాష్‌రెడ్డి ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌ర‌గ‌నుంది. తెలంగాణ హైకోర్టు నిర్ణ‌యంపై స‌ర్వత్రా ఉత్కంఠ నెల‌కుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?