ఢిల్లీ కలిపింది ఇద్దరినీ…!

గల్లీలో చెరో దారిలో ఉన్న ఇద్దరు టీడీపీ మాజీ మంత్రులను ఢిల్లీ కలిపింది. అధినేత చంద్రబాబు పది రోజుల క్రితం అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలులో ఉన్నారు. సీనియర్ నేతలు, మాజీ…

గల్లీలో చెరో దారిలో ఉన్న ఇద్దరు టీడీపీ మాజీ మంత్రులను ఢిల్లీ కలిపింది. అధినేత చంద్రబాబు పది రోజుల క్రితం అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలులో ఉన్నారు. సీనియర్ నేతలు, మాజీ మంత్రులు నిరసనలు చేస్తున్నా వారు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగానే పరిస్థితి ఉంది.

ఈ నేపధ్యంలో బాబు అరెస్ట్ తరువాత ప్రజల మద్దతుని కూడగట్టడంతో ఇప్పటికే టీడీపీ వెనకబడి ఉంది. అయితే గల్లీలో జరుగుతున్న ఆందోళలను ఒక విధంగా ఉంటే ఢిల్లీ నుంచి ఏదో విధంగా నరుక్కు రావాలని టీడీపీ భావిస్తోంది.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఉపయోగించుకుని చంద్రబాబు అరెస్ట్ ని అక్కడ ప్రస్తావించాలని నిర్ణయించింది. దాంతో పార్లమెంట్ లో గాంధీ విగ్రహం వద్ద బాబు అరెస్ట్ కి నిరసనగా టీడీపీ చేసిన కార్యక్రమానికి ఏపీ నుంచి సీనియర్ నాయకులను పిలిపించారు. అలా విశాఖ నుంచి మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు ఢిల్లీకి చేరుకున్నారు.

లోకేష్ కి కుడి ఎడమలుగా ఇద్దరూ నిలిచి ఆందోళనలల్లో పాల్గొన్నారు. సేవ్ ఏపీ అంటూ నినాదాలు చేసారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు బాబుని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయనను విడుదల చేయాల్సింది కోర్టు, మరి కోర్టు వారి ముందు ఇలాంటి డిమాండ్లు చెల్లుబాటు అవుతాయా అన్నది సీనియర్ నేతలకే తెలియాలి.

చంద్రబాబు అరెస్ట్ కాదు కానీ పార్టీ నేతలు అంతా ఒక్క చోట కలుస్తున్నారు. అయితే ఎడముఖాలు పెడ ముఖాలు మాత్రం షరా మామూలుగానే ఉంటున్నాయి. గల్లీలో పోరాటం గట్టిగా చేయాల్సిన వేళ ఢిల్లీలో సాధించేది ఏముంటుంది అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.