బీసీలకు 90 ఎమ్మెల్యే, 13 ఎంపీ సీట్లు !

బీసీలకు రాజ్యాధికారం అంతిమ లక్ష్యమని జాతీయ బీసీ సంఘం స్పష్టం చేసింది. అర కొర సీట్లు నామమాత్రం అధికారం తమకు వద్దని, బీసీలకు జనాభా ప్రాతిపదికన సీట్లు యాభై శాతం ఇవ్వాల్సిందే అంటోంది. ఏపీలో…

బీసీలకు రాజ్యాధికారం అంతిమ లక్ష్యమని జాతీయ బీసీ సంఘం స్పష్టం చేసింది. అర కొర సీట్లు నామమాత్రం అధికారం తమకు వద్దని, బీసీలకు జనాభా ప్రాతిపదికన సీట్లు యాభై శాతం ఇవ్వాల్సిందే అంటోంది. ఏపీలో వచ్చే ఎన్నికల్లో 90 ఎమ్మెల్యే సీటు, 13 ఎంపీ సీట్లు ఇచ్చే పార్టీకే తమ మద్దతు అని జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంగళరావు యాదవ్ అంటున్నారు. ఏపీలో ఉన్న మొత్తం 175 సీట్లలో సగానికి పైగా బీసీలకు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు.

బీసీలకు రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాటం చేపడతామని ఆయన అంటున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాల నుంచే బీసీల  రధయాత్ర మొదలవుతుందని అన్నారు. డిసెంబర్ 7 నుంచి మొదలయ్యే ఈ యాత్ర ఇచ్చాపురం నుంచి కర్నూల్ దాకా కొనసాగుతుందని అన్నారు.

బీసీలు ఓటు బ్యాంక్ కాదని పాలకులుగా మారాల్సిన అవసరం ఉందని బీసీ నేతలు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.

బీసీ ప్రధానిగా ఉన్న దేశంలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందని వారు మండిపడ్డారు. త్వరలో ఢిల్లీ లో బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద ఉద్యమం నిర్వహిస్తామని బీసీ నేతలు అంటున్నారు. ఏపీలో బీసీలు ఈసారి నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తారు అని పేర్కొనడం విశేషం.